
''ఆధునిక సాహిత్య ప్రపంచంలో తెలుగుదేశపు సరిహద్దులకు అవతల అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తెలుగువారి తరఫున ప్రతినిధిగా నిలుచోగలిగినవాడు గురజాడ ఒక్కడే. అతను రాకముందు ఉన్న కవిత్వానికి అతను రాసిన తర్వాత వచ్చిన కవిత్వానికి పోలికే లేదు.''
(శ్రీశ్రీ 1954 ఆగస్టు 6- తెలుగు స్వతంత్ర)
కవిగా మాత్రమే కాదు; కథా రచయితగా గురజాడ ధ్రువతార. కన్యాశుల్కం నాటకకర్తగా ఇక చెప్పేదేముంది? నాటికి నేటికి ఏనాటికీ అదొక సామాజిక చరిత్ర. ప్రాచీన సాహిత్యానికి నన్నయ లాంటి వాడు ఆధునిక సాహిత్యానికి కందుకూరి వీరేశలింగం. వారి కాలం నాటి భాషా సాహిత్యాల స్థితిగతుల వరకు మాత్రమే ఈ పోలిక. కార్య క్షేత్రాలు రచనా లక్ష్యాలు వేరే!
నన్నయ వ్రాయసకారుడు./కందుకూరి కార్యశూరుడు.
తెలుగులో వర్తమాన ప్రక్రియలకు తానే మొదటి కావ్యకర్తనని కందుకూరి చెప్పుకున్నప్పటికీ వాటిని తన అసాధారణ కళా నైపుణ్యంతో మెరుగులు దిద్ది అజరామరమైన కళాఖండాలుగా తీర్చిదిద్దింది గురజాడ మాత్రమే! వీరేశలింగం ప్రధాన కార్యక్షేత్రం సంఘ సంస్కరణ. అందు నిమిత్తమే చాలా రచన చేశాడు. సంఘ సంస్కరణకి ఆయుధంగా సాహిత్యాన్ని ఉపయోగించాడు. ఈ తక్షణ అవసరార్థమే తను రచనలు చేయడం వల్ల ఆ సమస్యలు సమసిపోయిన వెంటనే అవి ప్రాసంగికత కోల్పోయి పాఠక బాహుళ్యానికి దూరమయ్యాయి. వీరేశలింగం తన 44వ ఏట వరకు ప్రాచీన పద్య ప్రక్రియలోనే సంప్రదాయ రచనలే చేస్తూ వచ్చాడు. ఆ తరువాత వస్తు స్వీకరణలో ఆయన దృష్టి మారింది. అభాగ్యోపాఖ్యానం, సరస్వతీ నారద సంవాదం (1875) రచనలతో వస్తువు పట్ల ఆయన దృక్పథం మారింది. ప్రబంధ ప్రక్రియను పాండిత్య ధోరణిని వదిలేసి నవ్య కవిత్వపు ఆలోచనలు ఆవిర్భవించడానికి ఈ రెండు అధిక్షేప రచనలు దోహదం చేశాయి.
1862లో పుట్టిన గురజాడ, వీరేశలింగం లాగే తొలుత ప్రాచీన కవితా ధోరణిలో మాటల మబ్బులు, పుష్పలావికలు, సుభద్ర మొదలైన సంప్రదాయ రచనలు చేశాడు. ఒకపక్క వీరేశలింగం సంఘ సంస్కరణ సంఘర్షణ, మరోపక్క గిడుగు వ్యవహారిక భాషావాదం చర్చ, ఇంకో పక్క చాప కింద నీరులా ఆంగ్ల భాష వల్ల చదల చీకటి కదల బారుతోంది.
సామాజిక రంగంలో వీరేశలింగం, భాషారంగంలో గిడుగు రామమూర్తి కొత్త భావాలను ప్రవేశపెడితే ఆ రెండింటిని తన రెండు చేతులతో అందిపుచ్చుకొని కొత్తపాతల మేలు కలయికలతో క్రొమ్మెరుంగులు చిమ్మాడు గురజాడ.
అందుకే... ''పురాణ కథలతో అనువాదాలతో రచనలు వెల్లువెత్తుతున్న రోజుల్లో వర్తమాన సామాజిక వాస్తవికతను వస్తువుగా చేసుకుని రచనలు చేశాడు గురజాడ. తెలుగు సారస్వతంలో నాటకానికి, కవిత్వానికి, కథకు శంకుస్థాపన చేసిన మహా పురుషుడు గురజాడ'' అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు.
గురజాడ కార్యనిర్వహణకు కావలసిన భూమికను ఏర్పాటు చేసింది కందుకూరి. దానికి చేదోడు వాదోడుగా నిలిచింది గిడుగు రామమూర్తి.
నిజానికి కందుకూరి ఆశించిన లక్ష్యాన్ని తన పదునైన సజనతో సాధించాడు గురజాడ. వస్తువులోనూ శిల్పంలోనూ భాషలోనూ భావనలోనూ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు. ''నా కావ్య కళ నవీనం. కావ్య ఇతివృత్తాలు భారతీయం. కవితలో ఉత్తమ ప్రయోజనాలను లక్షించాను. జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథ కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను.'' అన్నాడు. అంతేనా! ''నాది ప్రజల ఉద్యమం దానిని ఎవరిని సంతోష పెట్టడానికి వదులుకోను'' అని తెగేసి చెప్పాడు.
గురజాడ ప్రయోగవాది. తెలుగు సాహిత్యంలోనే ముత్యాలసరాలు ఒక వినూత్న, అత్యంత సాహసోపేతమైన ప్రయోగం. మాత్రా ఛందస్సులో వాడుక మాటలతో సంస్కరణ భావాలను వ్యక్తపరచడానికి వినియోగించడమే విశేషం. 1892లో కన్యాశుల్కం, 1910లో ముత్యాలసరాలు రాసి నవ్య రీతికి నాంది పలికాడు. వర్తమాన సమాజానికి చెప్పవలసిన భావాలను ఆశు సాంప్రదాయాల నుంచి తీసుకొని చెప్పడం గురజాడ తొక్కిన కొత్త పుంత. అంటే చెప్పే పద్ధతి పాతది, విషయం కొత్తది. దానికి ముత్యాల సరాలు అని నామకరణం చేశాడు.
''గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా'' అని తన కవితా లక్షణాన్ని ప్రారంభంలోనే ప్రకటించాడు. ముత్యాల సరాలు గేయం సంఘంలో ఉన్న మూఢనమ్మకాన్ని ప్రశ్నించింది. అరుదుగా వచ్చే తోకచుక్క వల్ల కీడు కలుగుతుందనే గుడ్డి నమ్మకాన్ని ఖండిస్తుంది. సంఘసంస్కరణ భావాలకు ప్రతీకగా భర్తను సామాజిక విశ్వాసాలకు ప్రతీకగా భార్య పాత్రలను ఈ గేయంలో ప్రవేశపెట్టాడు గురజాడ.
''సన్నకాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా'' శాస్త్ర విజ్ఞానం లేని రోజుల్లో ప్రకృతి పరిణామాన్ని, ప్రజలు అర్థం చేసుకున్న తీరునీ తను తోకచుక్కను ఎలా దర్శించిందీ గురజాడ చెబుతున్నాడు.
''దూరపు బంధువు యితడు భూమికి
దారిపోవుచు చూడవచ్చెను....
తలతునేనిది సంఘసంస్కరణ
ప్రయాణ పతాకగన్'' లోకం తోకచుక్కని అపశకునంగా భావిస్తే గురజాడదాన్ని దారిన పోతూ వచ్చే దూరపు చుట్టంగా భావించాడు. సంఘసంస్కరణ జెండాగా చేపట్టాడు. దానినే తన కవిత్వపు ఎజెండాగా మార్చుకున్నాడు. ఇలా ఒకపక్క సంస్కరణ భావాలు ప్రవేశ పెడుతూనే మరోపక్క జాతి మత వర్ణ భేదాలను నిరసించాడు. జ్ఞాన మార్గాన్ని కీర్తించాడు.
''యెల్ల లోకము వొక్క యిల్లై
వర్ణభేదములెల్ల కల్లై/ వేల నెరుగని ప్రేమబంధము
వేడుకలు కురియ'' అంటూనే..
''మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును'' అని చివరకు మిగిలేది ఏమిటో చాటి చెప్పాడు.
''కాసులు'' కవిత సంభాషణ ధోరణిలో సాగుతుంది. ఇందులో ఆదర్శ దాంపత్యాన్ని చిత్రించాడు .ప్రేమ పెన్నిధి లాంటిదని ప్రేమ లేనిదే బతుకు చీకటని, ప్రేమ గొప్పతనాన్ని చెప్పాడు. దంపతుల మధ్య ఉండాల్సిన ఆదర్శ ప్రేమను గురించి చెబుతూ ..
''మగడు వేల్పన పాత మాటది
ప్రాణమిత్రుడ నీకు'' అంటాడు.
భార్య భర్తల మధ్య ఉండాల్సినవి అధికార సంబంధాలు కావు. 'ప్రాణస్నేహం' అనే కొత్త విలువని గురజాడ మొదటిసారి ప్రతిపాదించాడు. ఇది ఎంత గొప్ప ప్రజాస్వామిక భావన!
''లవణ రాజు కల''లో కులం కన్నా గుణం గొప్పదని చెప్పాడు.
''మలిన దేహుల మాలలనుచును
మలిన చిత్తుల కధిక కులముల
నెలవొసంగిన వర్ణధర్మమధర్మ ధర్మంబే'' అని నిరసించాడు.
''మంచి చెడ్డలు మనుజులందున
యెంచి చూడగ రెండె కులములు
మంచి యన్నది మాల యైతే
మాలనే అగుదున్'' అన్నాడు. ఇది మామూలు మాట కాదు. ఆ కాలం నాటికి ఇది విప్లవ ప్రతిపాదన. దళితుల కులాన్ని తిట్టుగా పలికినా నిప్పులతో నోటిని పుక్కిలించే పోగాలమది.
''కన్యక''లో కూడా కులం కన్నా గుణం గొప్పదని చెప్పాడు. శిథిలమైన రాచరిక వ్యవస్థలోని ఒక సాంఘిక దురన్యాయాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. దేవాలయానికి వెళుతున్న కన్యకని దారిలో రాజు అధికార మదంతో చేపట్టబోతే ఆమె ఆత్మాభిమానంతో ఎదిరిస్తుంది. దౌర్జన్యం కూడదని ధర్మంగా స్వీకరించమని ఆమె తండ్రి వేడుకున్నా రాజు తిరస్కరిస్తాడు. రాచరిక వ్యవస్థలోని క్రౌర్యం సామాజిక దౌష్ట్యం ఈ చర్య వల్ల మనకు తెలుస్తుంది.
''పట్టమేలే రాజువైతే/ రాజునేలే దైవముండడో'' అంటూ తల తన్నేవాడుంటే తాడిదన్నే వాడుంటాడనీ...
''కండకావరమెక్కి నీవీ/ దుండగము తలపెట్టినందుకు
ఉండడా ఒక దైవమంటూ/ ఉండి ఊర్కొనునా?''
రాచరికంలో రాజే రక్షకుడు. కానీ, కంచే చేను మేస్తే ఇక కన్యకకి రక్షణ ఎక్కడిది? చివరికి అగ్నిలో దూకింది. నిజానికి దూకింది ఆమె కాదు. అక్కడ రాజు పరపతే మంట గలిసింది. చివరికి -
''పట్టమేలే రాజు పోయెను/ మట్టి కలిసెను కోటపేటలు
పదం పద్యం పట్టి నిలిచెను/ కీర్తులపకీర్తుల్..'' ఆమె కీర్తి అతని అపకీర్తి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయాయి.
''పూర్ణమ్మ'' కరుణరసాత్మకమైన గేయం. ఇది నాటి సాంఘిక దురాచారానికి నిరసనగా రాసింది. ముక్కుపచ్చలారని ముద్దులొలికే పిల్లని కాటికి కాలు చాచుకునే వాడికి కట్టబెట్టడం కథ. డబ్బుకు దాసోహమైన క్రూరమైనలోకం కథ. ముసలి మొగుడుతో అత్తవారింటికి పూర్ణమ్మ బయలుదేరుతుంటే ఇంట్లో అందరూ బాధ పడుతూ ఏడుస్తారు. కానీ, '' కాసుకు లోనై అల్లుని తలుచుకు/ ఆనందించెను అయ్యొకడే''నట!
కన్న కూతురు సౌభాగ్యం కన్నా కాసులే ప్రధానమైన తండ్రిని చూస్తే అభిమానం కంటే ఆర్థికానిదే పైచేయని అర్థమవుతుంది. డబ్బుజబ్బుచేసిన లోకానికి గురజాడ తన సృజనతో సాహితీ వైద్యం చేయడానికి పూనుకున్నాడు. ''మనిషి'' కవితలో మానవతావాదాన్ని ప్రతిపాదించాడు. రాళ్ళని రప్పలని పూజించడం కన్నా నీ ఎదుటనున్న మనిషిలోనే మహాత్ముడు ఉన్నాడని చెప్పాడు.
''కన్ను తెరచిన కానబడడో/ మనిషి మాత్రుడి యందు లేడో
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి'' అంటూ హితబోధ చేస్తాడు.
''దేశభక్తి''గేయం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గురజాడ రచనలన్నీ శిథిలమైపోయి ఒక్క దేశభక్తి మిగిలినా చాలును, అతన్ని ప్రపంచ మహాకవిగా గుర్తించడానికి అంటాడు శ్రీశ్రీ. రోణంకి, చాసో లాంటి పెద్దలు దేశభక్తి గేయంలోని కొన్ని చరణాలు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం గోడల మీద రాయదగ్గవని కీర్తించారు. ఈ గేయం విశ్వమాన ప్రేమకు ఎత్తిన స్వర్ణ పతాక. ''దేశమును ప్రేమించుమన్నా'' అన్న మాటతో ప్రారంభమై, ''దేశమందభిమానములు మొలకెత్తవలనోయి'' అన్న మహాలక్ష్యంతో ముగుస్తుందీ గేయం. ''దేశమంటే మట్టి కాదోరు/ దేశమంటే మనుషులోరు'' అని సజీవమైన నిర్వచనం ఇచ్చాడు గురజాడ.
''చెట్టపట్టాల్ పట్టుకుని/ దేశస్థులంతా నడవవలెనోయి/ అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయి'' అంటూ ఆధునిక జీవన సూత్రం ప్రతిపాదించాడు. సామరస్య జీవన ప్రస్థానానికి మార్గం సుగమం చేశాడు. ''దేశమనియెడి దొడ్డవృక్షం/ ప్రేమలను పూలెత్త వలెనోరు'' కులమత బేధాలు విడనాడి ఏ ప్రాంతం వాళ్ళయినా 'మనందరం మనుషులం' అనే సంగతి గుర్తుపెట్టుకుని మెలగమన్నాడు. నైసర్గిక చిహ్నాలు ఏవీ లేనందున కేవలం మనిషిని కేంద్రంగానే చెప్పడం వల్ల ఈ దేశభక్తి గేయం ప్రపంచంలో ఏ దేశస్థులకైనా వారి జాతిగీతంగా పాడుకునే సౌలభ్యం ఉంది. ''మతం వేరైతేను యేమోయి/ మనసులొకటై మనుషులుంటే'' నిజంగా మహాకవి ఆశించినట్టు ఇలాగే ఉంటే దేశం ఎంత బాగుంటుందో ఊహించండి. దేశ చట్టసభల్లో ఇది తప్పనిసరి ప్రార్థన గీతం కావాలి. మన మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ రక్కసులకి ఈ గేయం వాళ్ళ దినచర్యలో తప్పనిసరి పఠనం కావాలి. అలా అయితే ఏదో ఒక రోజు ఏదో ఒక నాటికి వాళ్ల బుద్ధి మారకపోతుందా?
దేవులపల్లి గారు అన్నట్టు గురజాడ మరణించిన తరువాతే జీవించడం మొదలుపెట్టాడు. వెంటనే కాదు సుమండీ! పునరుజ్జీవనానికి కొంత కాలం పట్టింది. దీనికి సరైన కారణం కొత్తపల్లి వీరభద్ర రావు గారు ఊహించారు. ''గురజాడ మరణించిన పాతికేళ్ల వరకు ఆయన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి కారణం ఆయన రచనల లోపం కాదు. ఆయన రచనల్నీ ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి తెలుగు వారు చాలా విషయాలు నేర్చుకోవలసి రావడమే ముఖ్యం కారణం'' అన్నారు. ఇది అక్షరాలా నిజం.
''ఏమైనా ఆయన మరణించిన చాలాకానికి తప్ప గురజాడ ప్రభావం ఆయన జీవించి ఉన్న రోజుల్లో సువ్యక్తం కాలేదన్నది సత్యం. ఆదిలో చిన్న పాయగా ఉండిన గురజాడ ప్రభావం ప్రారంభంలో నెమ్మదిగా ఆ తరువాత వేగంగా పెరిగి పెద్దదై రాను రాను పరవళ్ళు తొక్కి ఒక మహా ప్రవాహంలాగా అయింది'' ఇది ప్రముఖ పత్రికా సంపాదకుడు నార్ల వారి మాట.
(సెప్టెంబరు 21 : గురజాడ జయంతి)
- జి.ఎస్.చలం
89196 93250