ప్రజాశక్తి-కాకినాడ : జిల్లాలో చేపట్టిన మూడో దశ రీ సర్వే పనులను ప్రణాళికాయుతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సర్వే అధికారులతో కలిసి హాజరయ్యారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకానికి సంబంధించిన రీ సర్వే పనుల పురోగతిని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్‌ఎ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భూ రికార్డుల స్వఛ్చీకరణలో భాగంగా జిల్లాలో మూడో దశ కింద 90 గ్రామాల్లో రీ సర్వే పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు ప్రణాళికబద్ధంగా పనిచేసి గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ వంటి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు సర్వే పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏడీ సర్వే బి.లక్ష్మీనారాయణ, ఇతర సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.










