Jan 09,2023 08:13

           మనుధర్మం సృష్టించిన సామాజిక వైరుధ్యాలను, ఆ కారణంగా ఏర్పడిన కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనాలను అనుభవిస్తూ ఛీత్కారాలను, అవహేళనలను ఎదుర్కొంటూ ఉన్న సామాజిక సమూహంలో జన్మించి దేశంలోనే ఒక అతిపెద్ద రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీ స్థాయికి ఎదిగి, ఆ వర్గాల అభ్యున్నతే కాక ఆ రాష్ట్ర దిశా నిర్దేశాలను ప్రభావితం చేసిన ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు. ఆయన రాసిన జీవన ప్రస్థానం 'సంకెళ్ళను తెంచుకుంటూ....' ఓ దళిత చీఫ్‌ సెక్రటరీ ఆత్మకథ'. ప్రజాస్వామ్య రాజ్యాధికారాన్ని పేదలకు అండదండలందించే సాధనంగా మలచిన స్ఫూర్తిదాయకమైన అధికారి తన ప్రస్థానాన్ని ఆవిష్కరించిన అక్షర కెరటం ఈ పుస్తకం. రచయిత తన పుట్టిన సంవత్సరం తనకు తెలియదంటూ తెలపడంలో ఏ విధమైన బేషజానికి తావివ్వలేదు. తన తల్లిదండ్రులు నిరుపేదలు, నిరక్షరాస్యులు కావడంతో తన పుట్టిన తేదీని నమోదు చేయలేదని, 1940 అని సంవతసరం నమోదైందని తన కుటుంబ నేపథ్యాన్ని చెప్పకనే చెప్పారు. ఆ కాలంలో తనను ప్రోత్సహించిన వ్యక్తులను ఏమాత్రం మరిచిపోకుండా వారి పేర్లను పొందుపరిచారు. ఇది ఆయన కృతజ్ఞతాపూర్వకమైన మనస్తత్వానికి నిదర్శనం. తాను జన్మించిన కృష్ణా జిల్లా పెద మద్దాలి గ్రామ భౌగోళిక స్వరూపం, గ్రామీణ నేపథ్యాన్ని వివరించారు. దళిత సాహితీవేత్త పద్మశ్రీ బోయి భీమన్నతో తనకున్న సాన్నిహిత్యాన్ని, ఆయన రచించిన 'పాలేరు' నాటకంలో కథానాయకుడి నేపథ్యాన్ని తన ఎదుగుదలతో పోల్చుకున్నారు. ఆ నాటకంలోని కొన్ని పంక్తులను పేర్కొన్నారు. తద్వారా తాను పాలేరు కొడుకునని సగర్వంగా చెప్పుకునేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఆ నాటకాన్ని తాను ఇంగ్లీషులోకి అనువదించానని పేర్కొన్నారు. సామాజిక అణిచివేతల అధిగమింపునకు పాలేరు నాటకం ఒక 'అక్షర ఖడ్గం'గా రూపొందిందని అన్నారు. మహాకవి గుర్రం జాషువా కలం నుంచి జాలువారిన 'గబ్బిలం' లోని ఒక కవితను సైతం పొందుపరిచి ఆ రచనల ప్రభావం తనపై ఎంతగా ఉన్నదో తేటతెల్లం చేశారు. ప్రముఖ కవి విలియం వర్డ్స్‌ వర్త్‌ ప్రచురించిన 'డాఫోడిల్స్‌' కవిత తెలుగు అనువాదాన్ని పొందు పరచడం ద్వారా తన హాస్టల్‌ జీవితంలో బహిరంగ మరుగుదొడ్ల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తద్వారా మరుగుదొడ్లను శుభ్ర పరుస్తూ దుర్భర జీవితం గడుపుతున్న పారిశుధ్య కార్మికుల జీవితాలను ఆయన స్పృశించారు.
        1961లో తాను యూపీఎస్సీ పరీక్షలు రాసి, అనంతరం ఇంటర్వ్యూకు హాజరైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దగ్గరలోని నగరానికి వెళ్లి ఉలెన్‌ సూట్‌ కుట్టించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇంటర్వ్యూ చేసిన నిపుణులు దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికైన దామోదరం సంజీవయ్యపై తన అభిప్రాయాలను కోరగా తాను చెప్పిన సమాధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత తన తల్లితండ్రుల స్పందనను తెలుపుతూ ... ముఖ్యంగా తన తల్లి చెప్పిన మాటలను ఇలా గుర్తు చేసుకున్నారు : ''మీ నాన్న పేరున్న పాలేరు. ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళలోనూ ఆయనను మంచిగా చెప్పుకుంటారు. ఆయన నిజాయితీ, పనితనం, కష్టపడి పనిచేయడం ద్వారా ఆ పేరు సంపాదించుకున్నారు. మీ నాన్న మంచి పాలేరుగా పేరు తెచ్చుకున్నట్లుగానే, నువ్వు నీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసి అత్యంత ఉన్నత పదవులు అందుకోవాలి. నిరుపేదలకు, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యాలి' అని తల్లి చెప్పిన మాటలు తన జీవితం ఆసాంతం ప్రభావం చూపాయని చెప్పు కున్నారు. ఐఏఎస్‌ అధికారి అయిన తరువాత తన ఊరికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఎస్సీ ఎస్టీలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను, ముస్సోరిలో శిక్షణ జ్ఞాపకాలను, ఐఏఎస్‌ అధికారిగా ఎంపికైన తొలినాళ్లలో అసిస్టెంట్‌ కలెక్టరుగా, సబ్‌ కలెక్టర్‌గా, ఢిల్లీలో అండర్‌ సెక్రటరీగా పనిచేసిన రోజులు సవివరంగా వివరించారు. వరంగల్‌ కలెక్టరుగా ఉన్న సమయంలో నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి, ప్రభుత్వాన్ని వారి వద్దకు చేర్చాలనే సంకల్పంతో తాను చేసిన కార్యక్రమాలను కొందరు తప్పుగా ప్రచారం చేసి 'నక్సలైట్‌ కలెక్టరు'గా ముద్ర వేసి ఇబ్బందులకు గురి చేశారంటూ, నాటి చేదు అనుభవాలను తేటతెల్లం చేశారు. నిరుపేదల పక్షాన నిలిచేందుకు కులం అడ్డు రాదని నిరూపించిన ఎస్‌.ఆర్‌.శంకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని రచయిత పలు సందర్భాలను ఉదహరించారు. శంకరన్‌ను తన గురువుగా ప్రస్తావించారు. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య ఆత్మకథలో 'వరంగల్‌ కలెక్టరుగా మాధవరావు చేసిన కృషి నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది, అణగారిన వర్గాల్లో వ్యక్తులకు ఎదురయ్యే ఛీత్కారాలు, అవమానాలు నుంచి ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవచ్చు అనేది ఆయన స్ఫూర్తితోనే నేను నా లక్ష్యాలను చేరుకున్నాను' అంటూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించారు. సాంఘిక సంక్షేమ శాఖ, షెడ్యూల్‌ కులాల సహకార ఆర్థిక సంస్థల ఉన్నతాధికారిగా తాను చేసిన విప్లవాత్మక మార్పులు, వెట్టిచాకిరి నిర్మూలనకు తాను చేసిన కృషిని, ఆర్థిక శాఖ వంటి ముఖ్యమైన శాఖలో కీలకంగా వ్యవహరించిన తీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీగా తాను ఎంపికైన విధానం, ఆ సందర్భంగా రాష్ట్ర పాలనలో క్రియాశీలక భూమిక పై ఈ రచనలో శ్వేతపత్రాన్ని ఆవిష్కరించారు. తాను పనిచేసిన ముఖ్యమంత్రుల ప్రస్తావనతో పాటు, సన్నిహితంగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన రెడ్డి, చంద్రబాబుల వద్ద ప్రజల పక్షాన నిలబడేందుకు మాత్రమే తాను ప్రాధాన్యతను ఇచ్చానంటూ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న అనుభవంతో తన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేరాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారని, తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. టి.అంజయ్యతో పనిచేసిన సందర్భంలో 'బిల్డింగ్‌ బైలాస్‌' మార్చడానికి ఉద్దేశించిన ఫైలును నిర్ద్వంద్వంగా తిరస్కరించానని, ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకమైనదిగా ఆయనకు స్పష్టం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన సందర్భంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్న పరిస్థితిని అధిగమించేందుకు నియమ నిబంధనలు రూపొందించిన వైనాన్ని తెలిపారు. తనలోని గాయకుడిని కూడా ఈ సందర్భం గా పరిచయం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టబద్ధత కోసం జరిగిన ఉద్యమంలో ఉక్కు సంకెళ్ళకు వెనుకాడ లేదంటూ, ఒక సామాజిక సమస్యపై అరెస్టయిన మాజీ చీఫ్‌ సెక్రటరీగా తన రికార్డును భవిష్యత్తులో కూడా ఎవరు చేరుకోలేరేమో అంటూ నేటితరం అధికారులకు బాధ్యతను గుర్తుచేశారు. దళిత, గిరిజన వర్గాల అభ్యున్నతికి వారి నిధులను వారికే ఖర్చు చేయాలనే సంకల్పంతో ఆనాటి ఉద్యమంలో సిపిఎం కీలక భూమిక పోషించిందని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్‌, మార్క్స్‌ మధ్య వారధి నిర్మించే క్రమంలో తాను ముందు ఉంటానని, భారతదేశంలో కులం, వర్గం అవిభాజ్య మైనవి అంటూ స్పష్టం చేశారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల బిడ్డగా జన్మించి, కులం సంకెళ్ళను తెంచుకొని, ఆత్మవిశ్వాసంతో ఒక రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ స్థాయికి ఎదిగి చూపించిన విధానాన్ని, పేదరికం అసమానత, సామాజిక అణచివేతలను అధిగమించిన తీరును కళ్ళకు కట్టినట్టు వివరించిందీ పుస్తకం. అంటరానితనం, అణచివేత, ఆధిపత్య అధికారాలను ధిక్కరించి ఆత్మగౌరవంతో ఎదిగి భావితరాలకు స్ఫూర్తి చిహ్నంగా నిలిచిన ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి ఆదర్శనీయమైన జీవితాన్ని ఆవిష్కరించిన పుస్తకంగా ఇది చరిత్రలో నిలుస్తుంది.

- నేలపూడి స్టాలిన్‌ బాబు,
83746 69988