Nov 14,2023 22:06

- రేపు న్యూజిలాండ్‌తో కీలక పోరు
- టాస్‌ కీలకం
మ.2.00గం||ల నుంచి
ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో లీగ్‌ పోటీలు ముగిసాయి. 45 లీగ్‌ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్‌ా4లో నిలిచిన జట్ల మధ్య సెమీస్‌ పోరు జరగనుంది. గ్రూప్‌లో అగ్రస్థానంలో టీమిండియా 4వ స్థానంలో న్యూజిలాండ్‌తో తొలి సెమీస్‌లో తలపడనుంది. వాంఖడే మైదానంలో జరిగే తొలి సెమీస్‌లో టాస్‌ కీలకంగా మారనుంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపనున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియా విజయ తీరాలకు చేరుతున్న దశలో మహేంద్ర సింగ్‌ ధోనీ రనౌట్‌ను భారత క్రీడాభిమానులను ఇప్పటికీ కలచివేస్తోంది. ఆ వేదనను మరచిపోవాలంటే నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను తప్పక ఓడించాల్సిందే. లీగ్‌ దశలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై చిత్తుచేసింది. తొలిధర్మశాల వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 273పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారతజట్టు 48ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 274పరుగులు విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ(5/54) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మరోవైపు విరాట్‌ కోహ్లి(95) సెంచరీకి చేరువౌ ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా దుర్భేధ్య ఫామ్‌లో ఉంది. లీగ్‌ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ నెగ్గిన ఏకైక జట్టు భారతజట్టు మాత్రమే. మరే జట్టు ఈసారి టోర్నమెంట్‌లో ఇంత మెరుగైన ప్రదర్శనను కనబర్చలేదు. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ అందరూ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. మరోవైపు పేసర్ల విభాగంలో బుమ్రా, సిరాజ్‌, షమీతోపాటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాకూడా మెరుగైన ప్రదర్శనను కనబరుస్తున్నారు.
ఇక న్యూజిలాండ్‌ జట్టు విషయానికొస్తే.. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర, మిఛెల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. కివీస్‌ జట్టు టోర్నీ ప్రారంభంలో ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచినా.. ఆ తర్వాత జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడి ఒక్క మ్యాచ్‌లో మ్యాచ్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి 4వ స్థానంలో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్‌ జట్టు ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడకపోయినా.. ఆ జట్టు స్థిరంగా రాణిస్తోంది. 13 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు సెమీఫైనల్‌కు చేరింది. 2007 నుంచి కివీస్‌ జట్టు వరుసగా సెమీస్‌కు చేరుతోంది. 2019కప్‌ మాదిరే భారత్‌పై గెలుస్తామని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇరుజట్ల ఇప్పటివరకు 7సార్లు ముఖాముఖి తలపడగా.. భారతజట్టు 3సార్లు, 4మ్యాచుల్లో ఓటమిపాలైంది. చివరిసారిగా ఇంగ్లండ్‌లోని మాంఛెస్టర్‌ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారతజట్టు 18పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక 1987లో టీమిండియా వాంఖడే వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 35పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
జట్లు(అంచనా):
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, సిరాజ్‌, బుమ్రా, షమీ, కుల్దీప్‌.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌(కెప్టెన్‌), కాన్వే, రచిన్‌ రవీంద్ర, మిఛెల్‌, ఫిలిప్స్‌, టామ్‌ లాథమ్‌(వికెట్‌ కీపర్‌), ఛాప్మన్‌, సాంట్నర్‌, టిమ్‌ సోథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, లూకీ ఫెర్గ్యుసన్‌.