ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : తెలుగు భాష ప్రస్తుత దుస్థితికి పాలకులే కారకులని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ఆధ్యర్యాన తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, తెలుగు భాషాభిమానులు మాట్లాడారు. ఎచ్చెర్ల్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె.ఉదరు కిరణ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారు 13 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. దేశంలో రెండో అతి పెద్ద భాషగా వెలుగొందిన తెలుగు భాష నేడు నాలుగో స్థానానికి దిగజారడానికి పాలకుల విధానాలే కారణమన్నారు. అంతర్జాతీయంగా అంతరించే భాషల జాబితాలో తెలుగు చేరిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి నుంచే కళాశాల తెలుగు విభాగాధిపతి పి.వి రమణ మాట్లాడుతూ పలు శాస్త్రాలను విద్యార్థులు మాతృభాషలోనే సులువుగా గ్రహించి ఆకలింపు చేసుకోగలరని, ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతం చేసే ప్రస్తుత విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్ డా.పి.సురేఖ మాట్లాడుతూ విద్యార్థులు భాషపై పట్టు కోసం కృషి చేయాలన్నారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి మాట్లాడుతూ బిడ్డ అభివృద్ధికి తల్లి పాలు దోహదపడినట్లే విద్యార్థుల సమగ్ర వికాసానికి మాతృభాష ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సభ్యులు నెట్టిమి రమణ ఆహ్వానం పలకగా, పి.సుధాకరరావు వందన సమర్పణ చేశారు. సాహితీ స్రవంతి కన్వీనర్ కె.శ్రీనివాసు, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, తెలుగు అధ్యాపకులు నారాయణరావు, ఆర్.మధు, ఉప్పు త్రినాథరావు, ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు.










