Oct 17,2023 08:44
  • అంతర్జాతీయ సమాజం ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలి
  • పాలస్తీనాకు ఇండియా ఫోరం సంఘీభావం
  • పాలస్తీనా అంబాసిడర్‌కు లేఖ అందజేత

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వామపక్షాలు, కాంగ్రెస్‌, జెడియు, ఎస్‌పి, బిఎస్‌పి తదితర అనేక రాజకీయ పార్టీల నేతలు సోమవారం న్యూఢిల్లీలో పాలస్తీనా రాయబారిని కలిసి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ లేఖ ఇచ్చారు. 'హింస ఎప్పటికీ పరిష్కారం కాదని నమ్ముతున్నాము. అది విధ్వంసం, బాధలకు దారి తీస్తుంది. అందువల్ల ఘర్షణకు శాంతియుత పరిష్కారాన్ని తీసుకురావడంలో అంతర్జాతీయ సమాజం కృషిని పెంచాల్సిన అవసరాన్ని మేము నొక్కిచెప్పాము. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి, పాలస్తీనా ప్రజల హక్కులు, గౌరవాన్ని గౌరవించేలా అంతర్జాతీయ సమాజం ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలి. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని నిర్ధారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు, బహుపాక్షిక కార్యక్రమాలను తీవ్రతరం చేయాలి' అని కోరారు.
         'గాజాలో కొనసాగుతున్న సంక్షోభం, పాలస్తీనా ప్రజల బాధల గురించి మేము మా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ విచక్షణారహితంగా బాంబు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మారణహోమానికి ప్రయత్నమని మేము విశ్వసిస్తున్నాం. అమాయకుల ప్రాణనష్టం, ఇళ్లు, మౌలిక సదుపాయాల ధ్వంసం జరగకుండా నిరోధించడానికి అన్ని శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని మేము కోరుతున్నాము'' అని పేర్కొన్నారు.
         'గాజా ప్రజలకు అత్యవసరంగా, అడ్డంకులు లేకుండా మానవతా సహాయం అందించాలని మేము పిలుపునిస్తున్నాము. ఆహారం, నీరు, వైద్య సహాయంతో సహా అవసరమైన సామగ్రి ఎటువంటి ఆటంకం లేకుండా బాధిత ప్రజలకు చేరేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.
         'మహాత్మా గాంధీ మాటల్లో 'పాలస్తీనా అరబ్బులకు చెందినది. అదే అర్థంలో ఇంగ్లండ్‌ ఆంగ్లేయులకు, ఫ్రాన్స్‌ ఫ్రెంచ్‌ వారికి చెందినది' అని మేము గట్టిగా విశ్వసిస్తాము. ఇది పాలస్తీనియన్ల సార్వభౌమాధికారం. ప్రజలు, వారి మాతృభూమిపై ఇతర దేశాల హక్కు వలె, ప్రాదేశిక హక్కులను గుర్తించే ప్రాముఖ్యతపై దాని నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. పాలస్తీనా ప్రజలు 75 ఏళ్లుగా అపరిమితమైన బాధలను అనుభవిస్తున్నారని గుర్తించి, వారి దుస్థితికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని మేము గట్టిగా చెబుతున్నాము. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనను గుర్తించాలని మేము అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాము. ఇటువంటి గుర్తింపు ఇజ్రాయిల్‌-పాలస్తీనా వివాదానికి న్యాయమైన, శాశ్వత పరిష్కారాన్ని నిర్ధారించడానికి కీలకమైన దశ. పాలస్తీనా ప్రజలకు వారి సొంత విధిని నిర్ణయించడానికి, శాంతి, భద్రతతో జీవించే అవకాశాన్ని అందిస్తుంది' అని పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసిన వారిలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసు, సుభాషిణి అలీ, మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌, ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా, సిపిఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, మాజీ ఎంపి మహ్మద్‌ అఫ్జల్‌, జెడియు నేత కెసి త్యాగి, మాజీ మంత్రి జెనా శ్రీకాంత్‌, ఎస్‌పి ఎంపి జావేద్‌ అలీ ఖాన్‌, ముజఫర్‌ షా (జమ్ము కాశ్మీర్‌), మాజీ ఎంపి సంతోష్‌ భారతీయ, బిఎస్‌పి ఎంపి డానిష్‌ అలీ, మాజీ ఎంపిలు షాహిద్‌ సిద్ధిఖీ, మహ్మద్‌ అదీబ్‌, నదీమ్‌ ఖాన్‌ ఉన్నారు.