Sep 07,2023 07:07

           తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదంగా మార్చడం ద్వారా లబ్ధి పొందడానికి బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు తాపత్రయపడుతున్న తీరు హాస్యాస్పదం. తొమ్మిదేళ్లు కేంద్రంలో అధికారం చలాయించిన తరువాత కూడా చేసిన అభివృద్ధి, ప్రజలకు జరిగిన మంచి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక ఎన్నికల వేళ అడ్డమైన గడ్డి కరవడానికి బిజెపి నేతలు సిద్ధపడుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తమిళనాడులోని అభ్యుదయ రచయితల సంఘం కొంతకాలంగా సనాతన ధర్మంలోని అనాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారంలో భాగంగానే సనాతన ధర్మ నిర్మూలన మహానాడు పేరిట ఒక సదస్సును ఆ సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి అంటరానితనం, అసమానతలు, లింగవివక్షతను ప్రస్తావిస్తూ వాటికి నిలయమైన సనాతన ధర్మం కరోనా, డెంగ్యూ వైరస్‌ లాంటిదని, దానిని నిర్మూలించాల్సిందేనని అన్నారు. దీనిలో కొంత భాగాన్ని తొలగించి, మిగిలిన దానికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టే కుట్రకు బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు తెరతీశాయి. తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేయడం ద్వారా పబ్బం గడుపుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు చూసిన ఉదయనిధి తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని, న్యాయప్రక్రియను సైతం ఎదుర్కొంటానని చెప్పారు. కుల, మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించేదే సనాతన వాదమని, అటువంటి వివక్ష ఏ మతంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని స్పష్టం చేశారు.
            నిరక్షరాస్యతను నిర్మూలించడమంటే చదువురాని వారినందరినీ నిర్మూలించాలని కాదు కదా! అదేమాదిరి సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే దానిలోని అరాచకాన్ని, అసమానతలను తొలగించాలనే అర్ధం. దీనిని దాచిపెట్టి నానా రచ్చ చేస్తున్న బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు సనాతన ధర్మంలో ఏముందో మాత్రం చెప్పడం లేదు. నిఘంటువుల ప్రకారం సనాతనమంటే మార్పు లేనిది, స్థిరమైనదని పండితులు చెబుతున్నారు. మార్పు లేనిది, మారనిది ఏముంటుంది? ఈ రోజుల్లో ఎవరైనా ముక్కుపచ్చలారని పసిబిడ్డను కాటికి కాలు చాపిన ముదుసలితో పెళ్లి చేయడానికి సిద్ధపడితే సనాతనుడని కీర్తిస్తామా? దురదృష్టవశాత్తు భర్త చనిపోతే, ఆ మృతదేహంతో పాటు తమ ముద్దుల కూతురుని తగలబెట్టి మురిసిపోయే తల్లితండ్రులు ఇప్పుడెక్కడైనా ఉన్నారా? కన్యాశుల్కం బారిన పడి బలవన్మరణాలకు పాల్పడిన పుత్తడిబొమ్మల కథలు మరిచామా? వరకట్నపు జ్వాలల్లో ఆహుతవుతున్న నిండు జీవితాలు ఇప్పటికీ ఎన్నో! డెంగ్యూ, కరోనాల కారణంగా ఎందరు చనిపోయారో మన కళ్ల ముందు లెక్కలున్నాయి. ఏది ప్రమాదమో తేలాలంటే సనాతన ధర్మం పేరిట చిందిన విషం ఎందరి ప్రాణాలను బలిగొందో, ఎందరి బతుకులను మొగ్గలోనే తుంచి మోడుగా మార్చిందో, మాతమ్మలు, జోగినీలు, దేవదాసీల పేరిట జీవచ్ఛవాలను చేసిందో లెక్కల గుట్టు విప్పి సమాజం ముందు పెట్టాలి. ఆ ధైర్యం చేయగలరా ?
         పోరాటాలు, సంఘ సంస్కరణ ఉద్యమాలు సనాతన ధర్మంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చాయి. కొన్ని దురాచారాలను పూర్తిగా నిర్మూలించాం. కానీ, ఇప్పటికీ వేయిపడగలతో కుల వివక్ష కాలకూటాన్ని వెదజల్లుతూనే ఉంది. శంభూకుడు, ఏకలవ్యుడిల వారసత్వాన్ని కొనసాగించడానికి ఒక పథకం ప్రకారం కుట్ర సాగుతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికీ చట్టంగా మారలేదంటే సనాతన ధర్మం నరనరాన నింపిన పురుషాహంకార భావజాలమే కారణం! అధికారంలో కొనసాగితేనే ఈ వివక్షను, అసమాతనలను బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తులు పెంచి పోషించగలుగుతాయి. దానికోసం ఏమైనా చేయడానికి, ఎంతకైనా తెగించడానికి వారు సిద్ధం. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇవ్వాలంటూ ప్రధాని స్వయంగా తన మంత్రివర్గ సహచరులను తాజాగా ఆదేశించడమే దీనికి నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నిరుద్యోగం, అధిక ధరలు, సామాజిక న్యాయం వంటి ప్రజల దైనందిన సమస్యలను పక్కనబెట్టి ఉద్రేకాలను రెచ్చగొట్టే ఈ తరహా ఎత్తుగడలను మరింతగా ఆ శక్తులు ముందుకు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. దీనిని తిప్పికొట్టేందుకు లౌకిక, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు మరింత ఐక్యంగా ముందుకు రావాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచాలి. రానున్న ఎన్నికల్లో బిజెపిని, దానికి వంత పాడే శక్తులను ఓడించడం ద్వారానే సమాజాన్ని ముందుకు తీసుకుపోగలం.