Aug 26,2023 10:36

టోక్యో : జపాన్‌ గురువారం నుంచి పసిఫిక్‌ సముద్రంలోకి అణు కలుషిత వ్యర్థ జలాలను విడుదల జేయడంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్‌ నిర్లక్ష్యపు చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ దేశం నుంచి సముద్ర చేపల ఉత్పత్తులను దిగుమతి చేసుకోరాదని చైనా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇతర ఆహార ఉత్పత్తులు, పిల్లల ఆహారోత్పత్తులు ఇప్పటికే బుక్‌ చేసిన వాటిని రద్దు చేసుకుంటున్నట్లు వివిధ సంస్థలు ప్రకటించాయి. విదేశాల నుంచే కాదు, ఈ అణు కలుషిత వ్యర్థాల విడుదలపై స్థానిక ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో జపాన్‌ ఆర్థికంగా నష్టపోవడమే గాక, రాజకీయ ప్రతిష్ట కూడా దెబ్బతింటోందని పలువురు పరిశీలకులు పేర్కొంటున్నారు. జపాన్‌ మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్‌ మౌనం వహించాయి. పరిమితి మేరకే అణు కలుషిత వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదలజేస్తున్నట్లు నమ్మబలికే యత్నం చేస్తున్నాయి. జపాన్‌ అక్వాటిక్‌ ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించిన చైనా తాజాగా సౌందర్య సాధనాలపైన, తల్లి బిడ్డలకు వాడే ఉత్పత్తులపైన ఆంక్షలు పెట్టింది. జపాన్‌ అత్యంత నిర్లక్ష్యపూరితంగా, బాధ్యతారహితంగా అణు వ్యర్థాలను విడుదల జేయడం వల్ల సముద్ర పర్యావరణం, ఆహార భద్రత ప్రమాదంలో పడతాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ చెప్పారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే జపాన్‌కు ఇది పెద్ద అవమానంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం మౌనం వహించినా, అక్కడి ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ మాత్రం జపాన్‌ చర్యను తీవ్రంగా విమర్శించింది. డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు లీ జె మ్యూంగ్‌, జపాన్‌ పర్యావరణ యుద్ధ నేరగాళ్ల మార్గాన్ని అనుసరిస్తున్నదని అన్నారు. లీ ఇంతకుముందు ఈ డంపింగ్‌ను 'రెండవ పసిఫిక్‌ యుద్ధం' అని పిలిచారు. గతంలో పొరుగు దేశాలపై దాడి చేసిన జపాన్‌ , పసిఫిక్‌ ప్రాంతంలో ఉన్న దేశాలకు మరో కోలుకోలేని విపత్తును తలపెట్టిందని విమర్శించారు. సియోల్‌లోని జపనీస్‌ దౌత్య కార్యాలయం ఎదుట డెమొక్రటిక్‌ పార్టీ నిరసన తెలియజేసింది. దక్షిణ కొరియాలో 80 శాతం మంది జపాన్‌ డంపింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. సీఫుడ్స్‌ తినకూడదని భావిస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఫిలిప్పైన్స్‌ మత్స్యకారుల సంఘాలు జపాన్‌ చర్యను తీవ్రంగా విమర్శించాయి. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంతో అణుధార్మిక కలుషిత జలాలు పసిఫిక్‌ మహా సముద్ర పశ్చిమ భాగానికి చేరుకోవచ్చని, ఫిలిప్సైన్స్‌ సముద్ర తీర జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదముందని ఆ సంఘాలు పేర్కొన్నాయి. ఈ అణు కలుషిత మురుగు నీటి వల్ల కలిగే హాని అనేక రూపాల్లో ఉంటుందని, దీని దుష్ప్రభావాలు త్వరలోనే స్పష్టంగా బయటపడతాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.