
ఒక దశాబ్దం తరువాత
మళ్లీ మృత్యువు మా ఇంటి తలుపు తట్టింది
నూరేళ్లు సాగాల్సిన జీవనయానం
డెబ్భైయేళ్లకే ముగిసిపోయింది
చేయాల్సిన పనులు
చూడాల్సిన వేడుకలు
ఇంకా మిగిలి ఉండగానే
అర్థంకారంగా నడక ముగించుకొని
తన దారిన తాను వెళ్లిపోయింది
చిన్నమ్మ - అమ్మ తరువాత అమ్మ
అమ్మలాగా మమ్మల్ని
కడుపులో పెట్టుకొని సాకిన చిన్నమ్మ
కళ్ళనుండి కారుతున్న
కన్నీటి చుక్కల్లో నుంచి రాలిపోయింది
కళ్ళముందు కదలాడుతున్న కరిగిపోయిన
కాలపు అంచులకు చిక్కుకున్న బాల్యపు జ్ఞాపకాలు
ధనుర్మాసపు చలిమంటలా వెచ్చవెచ్చగా
మనసుకు తాకుతున్నాయి
ఇప్పుడు చిన్నమ్మ లేని ఇల్లు బావురు మంటుంది
నిన్నటిదాకా తమ చుట్టూ తిరుగుతూ
ప్రేమతో తలలు నిమిరిన చేతులు
అదృశ్యమవ్వడాన్ని జీర్ణించుకోలేని మొక్కలు
తలలు వాల్చేసాయి
రాలుతున్న గులాబీలు, గన్నేరులు
ఆకాశపుదారుల్లో వెళుతున్న
ఆమె పాదాలకు మడుగులొత్తుతున్నాయి
ఇంటి వాకిట్లోకి ఎదురయ్యే మాటలు
నిశ్శబ్దపు తెరల వెనుకకు జరిగిపోయాయి
నడుస్తున్న నాలుగు పాదాలలోంచి
జారిపోయిన రెండు పాదాలను తలుచుకుంటూ
కాళ్లు ముందు పెట్టుకుని
ఆయన అలా కూర్చుని ఉన్నాడు
కరచాలనాలు పలకరింపులకు
స్పందించని కళ్ళు
శూన్యంలో ఆమెను వెతుక్కుంటున్నాయి
నిరామయ నిశ్చేష్టిత లోంచి
గడ్డకట్టుకుపోయిన ఆమె
అబ్బాయెక్కడ అన్న మాటను ముగింపు మాటగా పలికి
చెప్పాల్సిన చివరి మాటలన్నీ అక్కడే ఆపేసింది !
తన చేతిలోని చేతిని పిల్లలకు అప్పజెప్పి
తాను శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది!
- బండ్ల మాధవరావు