Oct 23,2023 09:50

రేపటి నుంచి పిల్లలకు దసరా సెలవులు ఇస్తున్నారు. పిల్లలందరి ముఖాల్లో ఆనందం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ అయ్యాక ప్రధానోపాధ్యాయుడు పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. 'పిల్లలూ! మీకు తెలియని ఒకప్పటి అంటే నా చిన్నప్పటి దసరా పండుగ గురించి చెప్పాలనుకుంటున్నాను. వింటారా?' అన్నారు హెచ్‌ఎం.
'చెప్పండి సర్‌' అన్నారు పిల్లలంతా ఒక్కసారిగా. 'మా చిన్నప్పుడు దసరా పండుగను గిలకల పండుగ అనేవారు. మా బడి పంతుళ్లు వెనుక నడుస్తుంటే మేమంతా వెదురుతో చేసిన విల్లంబులు, విల్లు చివరి భాగంలో కొందరు మిఠాయి పొట్లం ఆకారంలో బుక్కా పొడి, మరి కొందరు పువ్వులు పెట్టుకుని ముందు నడిచేవాళ్ళం. ప్రతి ఇంటి ముందు ఆగి బాణాలు వేస్తూ పాటలు పాడేవాళ్ళం.
ఏదయా మీ దయ మా మీద లేదు...
ఇంత సేపుంచుట ఇది మీకు తగదు
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు
శీఘ్రముగ పంపరే శ్రీమంతులారా
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా! అని పాట పాడుతూ పెద్దలందరి నుండి మామూళ్లు తీసుకునే వాళ్ళం' అన్నారు హెచ్‌ఎం.
'సర్‌! ఇప్పుడు కూడా దసరా మామూళ్లు అడుగుతారు కదండీ! అలా అప్పుడు మీరు అడిగేవారా?' అంది ఒక బాలిక.
'ఒక వ్యక్తి అభివృద్ధి కానీ, కుటుంబం, సమాజం, ప్రాంతం అభివృద్ధి కానీ చదువుతోటే సాధ్యమవుతుంది. అందుకని బడి బాగుండాలని బడికి, విద్య నేర్పే గురువులకు ఊరి ప్రజలు దసరా మాముళ్ల రూపంలో కొంత మొత్తం ఇచ్చేవారు. పిల్లలకు బలం రావడానికి పప్పు బెల్లాలు ఇచ్చేవారు. మేం సంవత్సరకాలంలో నేర్చుకున్న పద్యాలు, శ్లోకాలు, పొడుపు కథలు, గణిత సమస్యలు జ్ఞాన ప్రదర్శన చేసి పెద్దలను మెప్పించి కానుకలు పొందేవాళ్ళం. కాలక్రమేణా ఇది అన్ని వర్గాల వారికి దసరా పండుగ అంటే మామూళ్ల పండుగగా మారిపోయింది' అని నవ్వుతూ అన్నారు హెచ్‌ఎం.
'మీరు పాడిన పాటలో ఇంత గొప్ప అర్థం ఉందా సర్‌?'' అన్నాడు ఒక బాలుడు. 'అవును, అప్పటి ఉపాధ్యాయులు తాము వెలుగుతూ, పిల్లలను వెలిగే దివ్వెలుగా మార్చేవారు. ఇప్పుడు ఆ పాట అవసరం లేదు మీరంతా బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి' అని ముగించారు హెచ్‌ఎం.
- కె.వి.సుమలత,
94926 56255