- తరతరాలుగా సాగు చేసుకుంటున్న దళితులను తరిమేసేందుకు యత్నాలు
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లాలో మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తోన్న తుని నియోజకవర్గ పరిధి తొండంగి మండలం కోదాడలో అనేకేళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న చెరువు భూములపై కొందరి అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎలాగైనా ఆ భూములను స్వాధీనం తీసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో కుట్రలు పన్నుతున్నారు.
తొండంగి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1లో 103 ఎకరాల చెరువు భూములను కొత్త కోదాడ, పాత కోదాడ, కాలనీ కోదాడ, కొమ్మనాపల్లి గ్రామాలకు చెందిన సుమారు 500 మంది దళితులు మూడు తరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. పూర్వపు రోజుల్లో ఈ చెరువు నీటితో చుట్టుపక్కల గ్రామాల భూముల్లో పంటలను సాగు చేసేశారు. అనంతరం పంపా రిజర్వాయర్ ఏర్పాటు, పిబిసి కాలువ అందుబాటులోకి రావడంతో చెరువు నీరు అవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచి ఈ చెరువు భూమిని దళితులు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమణకు యత్నాలు
ఈ భూముల్లో 48 ఎకరాలు తమవేనంటూ అనపర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ భూముల నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని, చెరువు భూముల్లోకి వెళితే కేసులు పెడతామంటూ రెవెన్యూ అధికారులు తమను హెచ్చరిస్తున్నారని దళితులు వాపోతున్నారు. సిపిఎం, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం
మా తాతల కాలం నుంచి గ్రామానికి చెందిన చెరువు భూములను సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ప్రభుత్వ భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమదేనంటూ కొందరు వ్యక్తులు వస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించాలి. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ భూములకు సంబంధించి తమకు పట్టాలు ఇవ్వాలి.
- బూర్తి లోవరాజు, దళిత రైతు, కోదాడ

బెదిరింపులు సరికాదు
అనేక ఏళ్లుగా దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించడం శోచనీయం. నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసిన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. పోలీసులు, రెవెన్యూ అధికారుల బెదిరింపులను నిలుపుదల చేయాలి.
- ఎం.రాజశేఖర్, సిపిఎం జిల్లా కన్వీనర్, కాకినాడ జిల్లా

రైతులకు అండగా పోరాడుతాం
చెరువు భూములను ఆక్రమించుకోవాలని చూస్తే దళిత రైతుల పక్షాన నిలిచి పోరాడుతాం. ఇప్పటికే తహశీల్దార్, ఆర్‌డిఒలకు వినతిపత్రాలు ఇచ్చాం. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణ ప్రయత్నాలు అడ్డుకుని దళితులకు పట్టాలు ఇవ్వాలి.
- జి.అప్పారెడ్డి, జిల్లా కార్యదర్శి, ఎపి రైతు సంఘం










