
గాలి కాలుష్యం వల్ల కలిగే అనర్థాల గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం. తాజా నివేదికలో మరో విస్తుపోయే విషయమొకటి వెలుగుచూసింది. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణంలో నివసించే మహిళలు ప్రసవించే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో తగిన బరువుతో ఉంటున్నారు. కాలుష్య కారక ప్రాంతాల్లో నివసించే మహిళలకు జన్మించే బిడ్డలు మాత్రం తక్కువ బరువుతో పుడుతున్నారని తాజా సర్వే స్పష్టం చేసింది. సెప్టెంబరు 9 నుండి 13 వరకు ఇటలీ, మిలాన్‌లో జరిగే 'యూరోపియన్ రెస్పిరేటరీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్'లో ఈ నివేదికను సమర్పించనున్నారు. కాలుష్య రహిత ప్రాంతాల్లో జన్మించే బిడ్డలు తగిన బరువుతో పుడుతున్నారని, ఇది, భవిష్యత్తులో కూడా కాలుష్య కారక ప్రభావాలను ఎదుర్కొనడానికి వారిని సిద్ధం చేస్తుందని సర్వేలో స్పష్టమైంది.

పుట్టుకకు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏంటని ఆశ్యర్యంగా ఉండొచ్చు. కానీ ఇది వాస్తవమని సర్వే చెబుతోంది. అంతేకాదు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్రానిక్ అబ్రస్టక్టివ్ పల్మనరీ డిసీజెస్ (సిఒపిడి) ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో నగరాలను కాలుష్య కారకాలుగా తయారుచేయ వద్దని, పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించి పచ్చని వాతావరణం ఉండేలా చేయాలని సూచిస్తున్నారు.
అధ్యయనం ఇలా ...
ఈ పరిశోధనలో యూరప్‌లోని డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఎస్టోనియా దేశాల్లో నివసిస్తున్న 4,286 మంది పిల్లలు, వారి తల్లులను భాగస్వామ్యం చేశారు. ఉత్తర ఐరోపాలోని శ్వాసకోశ ఆరోగ్య అధ్యయనం నుండి ఈ సర్వే సేకరించారు. దీన్ని నార్వేలోని బెర్గెన్ విశ్వవిద్యాలయం(యుఐబి) పరిశోధకుడు రాబిన్ మజాటి సిన్సమల అందించారు. గర్భధారణ సమయంలో మహిళలు నివసించిన ప్రాంతాలను కూడా ఈ సర్వేలో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా పచ్చదనం, కాలుష్యకారక సాంద్రతలను అంచనా వేశారు. యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం నైట్రోజన్ డైఆక్సైడ్, ఓజోన్, బ్లాక్ కార్బన్, పార్టిక్యులేట్ మ్యాటర్‌లో రెండు రకాలైన పిఎం2.5, పిఎం10ల వాయు కాలుష్య సగటు స్థాయిల డేటాను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ సమాచారాన్ని నవజాత శిశువుల జనన బరువుతో పరిశోధకులు సరిపోల్చారు. ధూమపానం లేక ఏదైన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లుల వయసు వంటి జనన బరువును ప్రభావితం చేసే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
జనన బరువులో తేడాలు స్పష్టం
అధికస్థాయి వాయుకాలుష్యం బిడ్డల జనన బరువుతో ముడిపడి ఉందని, చిన్న రేణువులతో కూడిన పిఎం2.5, సాపేక్షంగా పెద్ద కాలుష్య కణాలు పిఎం10, నైట్రోజన్ డై ఆక్సైడ్, బ్లాక్ కార్బన్‌ల స్థాయిలు, 56 గ్రాములు, 46 గ్రాములు, 48 గ్రాముల సగటు తగ్గింపులతో జనన బరువును ప్రభావితం చేసిందిన పరిశోధకులు కనుగొన్నారు.
అలాగే పచ్చదనాన్ని కేంద్రంగా తీసుకున్నప్పుడు జనన బరువులో తేడా స్పష్టంగా కనిపించింది. వాయు కాలుష్య ప్రభావం వున్న ప్రాంతాల్లో కంటే పచ్చగా ఉన్న ప్రాంతాల్లో నివసించిన తల్లులు ప్రసవించిన బిడ్డల జనన బరువు 27 గ్రాములు హెచ్చుగా రికార్డు అయ్యింది.
'గర్భంలో ఉండగానే పిల్లల ఊపిరితిత్తుల అభివృద్ధి చాలా కీలకం. తక్కువ బరువు ఉన్న పిల్లలు ఛాతీ ఇన్ఫెక్షన్లకు గురవుతారని మాకు తెలుసు. ఇది ఆస్తమా, సిఒపిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది' అని సిన్సమల అంటున్నారు. అలాగే 'వాయు కాలుష్యం తక్కువ బరువు ఉన్న పిల్లల జననాలకు దారి తీస్తుందని మా అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. కాబట్టి పచ్చటి వాతావరణంలో నివసించడం ద్వారా ఈ ప్రభావాన్ని ఎదుర్కొనవచ్చ'ని ఆయన సూచిస్తున్నారు.
పట్టణాలలో మొక్కలు పెంచడం వల్లే కాలుష్యం తగ్గదు. ట్రాఫిక్ సమస్యను కూడా నియంత్రించాలి. వాహనాలు వదిలిన పొగ కారణంగా కాలుష్యమైన వాతావరణాన్ని పచ్చని మొక్కలు కొంతవరకు సహాయపడతాయి. అటువంటి వాతావరణంలో నివసిస్తున్న గర్భిణీలు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వారి శరీరం చురుకుగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
యూరోపియన్ దేశాల్లో చేసిన ఈ తాజా అధ్యయనం ప్రపంచ దేశాలకు ఓ గుణపాఠం నేర్పాలి. ముఖ్యంగా అభివృద్ధి పేరుతో పరిశ్రమలు, వాహనాలు, ఇతర హానికర వాయువుల వినియోగం మనదేశంలో విరివిగా పెరిగిపోతోంది. ఇటీవలే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యనగరంగా దేశరాజధాని ఢిల్లీ రికార్డులకెక్కింది. ఈ పరిణామం రాబోయే తరాలను తీవ్రంగా ప్రభావం చూపుతుంది. పుట్టుక నుండే వారి ఆరోగ్యం దెబ్బతిని భావితరాలు భవిష్యత్తు అంధ:కారమౌతుంది. ఈ హెచ్చరికలను కొట్టిపారేయకుండా సీరియస్‌గా పట్టించుకుని ఆరోగ్యకర వాతావరణంలో బిడ్డల జననాలు ఉండేలా కృషి చేయాలి. పాలకులు, ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.