
ప్రజల ఆదాయాలు తగ్గడం, ధరలు పెరుగుతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడం, తయారీ రంగ వృద్ధిలో క్షీణత... ఇవన్నీ కలిసి ఉధృతమవుతున్న ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఆశ్రితుల ఆస్తుల వృద్ధికి ఆశ్రయం కల్పించడం ఆపి, దానికి బదులుగా ప్రభుత్వ వనరులను ప్రజా పెట్టుబడులకు ఉపయోగించి, ఎంతగానో అవసరమైన మౌలిక వసతులను నిర్మించాల్సిన అవసరం వుంది. దీనివల్ల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ పెరుగుతుంది. అయితే, దేశ జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా తమ లాభాలను గరిష్టంగా పెంచుకునేందుకు విదేశీ, దేశీయ పెట్టుబడులకు మోడీ ప్రభుత్వం విధేయత కనబరుస్తున్నందున, ఈ సంక్షోభం మరింత అధ్వాన్నంగా మారుతుంది.
పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రాజధాని న్యూ ఢిల్లీలో గత ఆదివారం లక్షల సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రదర్శన జరిపారు. ఇంతటి బృహత్తరమైన ప్రజా ప్రదర్శనకు సంబంధించిన కవరేజీ... మన దేశాన్ని పట్టి పీడిస్తున్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రతిబింబాన్ని... అస్పష్టంగా కేవలం ఒక సంఘటనగా వర్ణించడానికి మాత్రమే పరిమితమైంది. పాత పెన్షన్ పథకం ప్రకారం, ఒక ఉద్యోగి చివరిసారిగా తాను అందుకున్న జీతంలో 50 శాతాన్ని బోనస్‌గా అందుకుంటాడు. ఈ మొత్తం కూడా ప్రతి ఏడాదీ ద్రవ్యోల్బణానికి తగినట్లుగా సర్దుబాటు అవుతూ వుంటుంది. మరోవైపు కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి అందుకునే పెన్షన్ పాత పెన్షన్ పథకం కింద వచ్చే మొత్తంలో సగానికి మించదు. 2004 తర్వాత సర్వీసు లోకి ప్రవేశించిన వారందరూ కొత్త పెన్షన్ పథకానికి మాత్రమే అర్హులని చట్టం పేర్కొంటోంది.
ఇరవయ్యేళ్ల తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే సమస్యగా ఇది మారిందన్నది వాస్తవం. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న ఆదాయాలతో భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న జీవన వ్యయ సంక్షోభాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. మధ్య తరగతి వారికి కూడా జీవనోపాధులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. కొత్త పెన్షన్ పథకాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినపుడు, పెన్షన్ అనేది కార్మికుడి హక్కు అని, అంతేకానీ ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతి కాదు అన్న సూత్రానికి కట్టుబడి సిపిఎం ఈ కొత్త పెన్షన్ పథకాన్ని వ్యతిరేకించింది. ఈ నాడు, ఆ వ్యతిరేకతకు గల కారణాలు ధృవీకరించబడుతున్నాయి.
మన దేశ ప్రజానీకం వాస్తవిక ఆదాయాలు కృశించిపోతున్నాయి. దీంతో జీవనం మరింత దుర్భరంగా మారుతోంది. దేశ ఆర్థికారోగ్యం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో దేశీయ డిమాండ్ తక్కువవుతోంది. పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. ఇటువంటి పెట్టుబడులతో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ వుండడం లేదు. ఉత్పత్తి చేసింది వెంటనే అమ్ముడయ్యి లాభాలు వచ్చి, అభివృద్ధి నమోదైతేనే పెట్టుబడులు పెరుగుతాయి. డిమాండ్, పెట్టుబడులు లేనపుడు ఆర్థిక వృద్ధి కూడా జరగదు. ఈ నాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న ప్రాథమిక సమస్య ఇది.
మోడీ ప్రభుత్వ హయాంలో మతం-కార్పొరేట్ బంధం మరింత బలపడుతుండడంతో, దేశంలో ఉత్పత్తి అయ్యే సంపదలో ప్రధాన భాగం ఆశ్రితుల చేతుల్లో వుంటోంది. అదానీ వ్యవహారం ఇందుకు మంచి ఉదాహరణగా వుంది. మెజారిటీ ప్రజలను పణంగా పెట్టి కొద్ది మంది ఆశ్రితులను మరింత సుసంపన్నులను చేయడానికి దేశ సంపద మళ్లించబడుతోంది. మోడీ ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు రెండు భారత దేశాలను-సంపన్నులకు ప్రకాశంతమైన భారత దేశాన్ని, నిరుపేదలకు బాధలు పడుతున్న భారతాన్ని-సృష్టించే క్రమానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అయితే, భారతదేశం పుంజుకుంటోందని, జిడిపి దృష్ట్యా చూసినట్లైతే ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా పయనిస్తోందంటూ మోడీ ప్రభుత్వం అవిశ్రాంతంగా చేస్తున్న ప్రచారం పేర్కొంటోంది. ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానితో నిమిత్తం లేకుండా, ప్రస్తుత గణాంకాల ధోరణులను బట్టి చూసినట్లైతే, 2027లో భారత్ మూడవ స్థానంలో వుంటుంది. కానీ, తలసరి జిడిపి దృష్ట్యా భారత్ ఎక్కడ వుంటుందనేదే వాస్తవం. తలసరి జిడిపి దృష్ట్యా చూసినట్లైతే, ఈనాడు ప్రపంచంలో భారత్ ర్యాంక్ 142.
కొత్తగా ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను చూపెట్టేందుకు ఇటీవల జరిగిన జి-20 సదస్సును ఉపయోగించుకున్నారు. కానీ, మళ్ళీ వాస్తవాలు పరిశీలిస్తే అసలు సత్యం బోధపడుతుంది. జి-20 దేశాలన్నింటిలోకి అత్యంత తక్కువ తలసరి జిడిపి భారత్‌దే. అలాగే మానవ వనరుల అభివృద్ధిలో కూడా దిగువ స్థానంలోనే వుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత తక్కువ కార్మిక ప్రాతినిధ్యం రేటు వున్న రికార్డు కూడా మనదే. అంటే అత్యంత ఎక్కువగా నిరుద్యోగ సమస్య నెలకొందన్నమాట.
దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది, ఫలితంగా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోంది. గతేడాది కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులు వచ్చే కొత్త ప్రతిపాదనలు 72.5 శాతం క్షీణించగా, ప్రైవేటు పెట్టుబడులు 79.2 శాతం తగ్గాయి.
'మేక్ ఇన్ ఇండియా' పదేళ్ల ఘన విజయంపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు ఇందులో నిజం ఏమిటి? 2013-14 నుండి తయారీ రంగం వృద్ధి సగటున 5.9 శాతం వుంది. పెట్టుకున్న లక్ష్యం మాత్రం 12-14 శాతంగా వుంది. కానీ ఈ లక్ష్యాన్ని సాధించలేదు. జిడిపిలో తయారీ రంగం వాటా 25 శాతం వుండాలని లక్ష్యంగా పెట్టుకోగా 16.4 శాతం దగ్గరే స్తంభించిపోయింది. 2011-12, 2021-22 మధ్య కాలంలో తయారీ రంగంలో ఉద్యోగాలు 12.6 శాతం నుండి 11.6 శాతానికి క్షీణించాయి. ఒబిసిలకు విశ్వకర్మ ప్రాజెక్టులను ఎర్ర కోట నుండి ప్రధాని మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. నైపుణ్యాలు కలిగిన కళాకారులకు రూ.13 వేల నుండి రూ.15 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అయితే, పార్లమెంట్‌లో ప్రకటించింది చూసినట్లైతే, రాబోయే ఐదేళ్ల కాలంలో రూ.13 వేల కోట్ల రుణాల ప్యాకేజీని ఐదు శాతం వడ్డీతో పంపిణీ చేస్తామని ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాల్లో దుస్థితి కూడా పెరుగుతోంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) డిమాండ్ గతేడాది కాలంలో 16.3 శాతం పెరిగింది. 2019-20 నుండి చూసినట్లైతే ఒక్కసారిగా 29.4 శాతం పెరిగింది. ఇది, మనుగడ కోసం ప్రజలు పడుతున్న దుస్థితి స్థాయిని తెలియచేస్తోంది. వాస్తవిక వేతనాలు ప్రతికూల అభివృద్ధిని నమోదు చేశాయని 2022-23 సంవత్సరానికి ఆర్థిక సర్వే పేర్కొంది.
ఆర్థిక కార్యకలాపాలు క్షీణించాయన్నది వీటన్నింటి ఫలితంగా వుంది. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్‌లు, రత్నాలు, ఆభరణాలు వంటి కార్మిక శ్రమ ఎక్కువ వుండే ఎగుమతులు క్షీణించడంలో ఇది కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా బాగా తగ్గుతోంది. అంటే ఈ రంగాల్లో దేశీయ ఉపాధి కూడా బాగా తగ్గుతోందనే అర్ధం.
ఫలితంగా ఆగస్టులో నిరుద్యోగం రేటు 8.1 శాతంగా వుంది. 2022లో యువత (15-24 సంవత్సరాలు) లో నిరుద్యోగం 23.22 శాతంగా వుంది. పట్టభద్రుల్లో ఇది ఏకంగా 42 శాతంగా వుంది. 2023 ఆగస్టులో దాదాపు 2 కోట్ల కుటుంబాలు ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద పని కావాలని డిమాండ్ చేశాయి. భారతదేశ ప్రజల డివిడెండ్‌ను మోడీ ప్రేరేపించిన విధ్వంసం ఇది.
ఉపాధి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్ళుగా ఆర్‌బిఐ పెట్టిన పరిమితి 6 శాతాన్ని ద్రవ్యోల్బణం అధిగమిస్తూనే వుంది. అంతకన్నా అధ్వాన్నమేంటంటే, ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో ఈ ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతోంది.
జిడిపి శాతంగా కుటుంబాల ఆర్థిక ఆస్తులు క్షీణించడమే ఈ మొత్తం సంక్షోభానికి ప్రధాన కారణంగా వుంది. 2020-21లో 15.4 శాతంగా వున్న ఈ ఆస్తులు 2022-23లో 10.9 శాతానికి పడిపోయాయి. బతకడం కోసం ప్రజలు తమ కుటుంబ ఆస్తులుగా వచ్చిన వెండి, బంగారాలను అమ్ముకుంటున్నారు. కుటుంబాల నికర ఆర్థిక ఆస్తులు 11.5 శాతం నుండి 5.1 శాతానికి పడిపోయాయి.
ప్రజల ఆదాయాలు తగ్గడం, ధరలు పెరుగుతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడం, తయారీ రంగ వృద్ధిలో క్షీణత... ఇవన్నీ కలిసి ఉధృతమవుతున్న ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఆశ్రితుల ఆస్తుల వృద్ధికి ఆశ్రయం కల్పించడం ఆపి, దానికి బదులుగా ప్రభుత్వ వనరులను ప్రజా పెట్టుబడులకు ఉపయోగించి, ఎంతగానో అవసరమైన మౌలిక వసతులను నిర్మించాల్సిన అవసరం వుంది. దీనివల్ల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్ పెరుగుతుంది. అయితే, దేశ జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా తమ లాభాలను గరిష్టంగా పెంచుకునేందుకు విదేశీ, దేశీయ పెట్టుబడులకు మోడీ ప్రభుత్వం విధేయత కనబరుస్తున్నందున, ఈ సంక్షోభం మరింత అధ్వాన్నంగా మారుతుంది. భారతదేశ సంపదను ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ప్రజల సంక్షేమానికి పెట్టుబడిగా పెట్టేలా చూసేందుకు గాను ప్రభుత్వ అధికార పగ్గాలు బిజెపి చేతుల్లో వుండకుండా చూడడం ఎంతో ముఖ్యం.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /