Oct 21,2023 07:13

            అన్నదాతల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నమ్మబలికి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ఆది నుంచి వంచిస్తూనేవుంది. కీర్తిశేషులు ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రతిపాదనల ప్రకారం రైతన్నలకు మద్దతు ధర అందిస్తామని ఊదరగొట్టిన మోడీ సర్కార్‌ ప్రతియేటా నయవంచనలతో ఉసూరుమనిపిస్తోంది. రబీ పంటలకు తాజాగా ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) విషయంలోనూ రైతుల పట్ల తన అమానవీయ వైఖరిని కేంద్ర ప్రభుత్వం మరోమారు చాటుకుంది. 2024-25 రబీ సీజన్‌కు గానూ గోధుమలు క్వింటాలుకు రూ.2275 (రూ.150 పెంపు), మసూర్‌ రూ.6425 (రూ.425), ఆవాలు రూ.5650 (రూ.200), కుసుమలు రూ.5800 (రూ.150), బార్లీ రూ.1850 (రూ.115), శనగ రూ.5440 (రూ.105) ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నామంటూ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కానీ పెంపు అనే మాట పచ్చి బూటకం. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఈ ధరాఘాతానికి కూడా మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలే కారణం. పెరిగిన సాగు పెట్టుబడులను పరిగణలోకి తీసుకోకుండా గత మద్దతు ధరల కంటే ఎక్కువగా ఇస్తున్నామని ఊదరగొట్టడం వంచన కాదా ?
           కేంద్ర వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సిఎసిపి) ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ఖరారు చేస్తుంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలకు రైతు నేరుగా వెచ్చించే (ఎ2) మొత్తాన్ని, కుటుంబ శ్రమ (ఎఫ్‌ఎల్‌)ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని (ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌) సిఎసిపి కనీస మద్దతు ధర నిర్ణయిస్తోంది. కౌలు, రుణాలపై వడ్డీ వంటివాటితో కలిపి సమగ్ర సాగు పెట్టుబడిగా పరిగణించే (సి2) ఆధారంగా చేసుకొని దానికి కుటుంబ శ్రమను కలిపి దానికి అదనంగా 50 శాతం జత చేసి కనీస మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాథన్‌ కమిటీ దశాబ్దాల కిందటే ప్రతిపాదించింది. అందువల్ల మోడీ సర్కార్‌ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నట్లు ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ ఆధారంగా ఎంఎస్‌పి నిర్ణయించినా..దానిని కూడా వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయించడం రైతులకు ద్రోహం చేయడమే.
            ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించేందుకే మోడీ సర్కార్‌ అబద్దాలతో కూడిన ఈ మద్దతు ధర పాచికను విసిరినట్లు స్పష్టమవుతోంది. సి2 వ్యయానికి, ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ వ్యయానికి మధ్య తేడా చాలా ఎక్కువ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలకు, సిఎసిపి ప్రతిపాదనలకు మధ్య తేడా కూడా హస్తిమశకాంతరంగా ఉంటుంది. గోధుమ పంటకు క్వింటాల్‌కు సి2 వ్యయాన్ని రూ.2051గా పంజాబ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. అదే సమయంలో సిఎసిపి చేపట్టిన ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ వ్యయం క్వింటాల్‌కు కేవలం రూ.741గా వుంది. అంటే సి2 వ్యయానికన్నా క్వింటాల్‌కు ఏకంగా రూ.1310 తక్కువగా వుంది. ఆ మేరకు అన్నదాతలను మోడీ సర్కార్‌ నిలువునా వంచించినట్లే. పంజాబ్‌లో దాదాపు 35 లక్షల హెక్టార్లలో గోధుమ పంట సాగవుతోంది. ఈ రకంగా పంజాబ్‌ రైతులు ఒక్క గోధుమ పంటకు సంబంధించే ఏకంగా రూ.13,500 కోట్లు నష్టపోతున్నారు. మహారాష్ట్రలో ఏటా గోధుమ రైతుల నష్టం రూ.4640 కోట్లుగా వుంది. తెలంగాణలో అధికారం కోసం పడరాని పాట్లు పడుతున్న బిజెపి ..శనగలకు మద్దతు ధర విషయంలో ఎన్నికల సమయంలోనూ మొండి చేయి చూపింది. తెలంగాణ రాష్ట్ర సి2 అంచనా క్వింటాల్‌కు రూ.6055గా వుండగా, ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ క్వింటాల్‌కు కేవలం రూ.2290గానే వుంది. అంటే రూ.3765 తక్కువగా వుంది. క్వింటాల్‌ ఎంఎస్‌పిని రూ.9351గా ప్రకటించాలని తెలంగాణ కోరుతుంటే కేంద్రం రూ.5440 మాత్రమే ప్రకటించింది. అంటే క్వింటాల్‌కు రూ.3911 చొప్పున నష్టంతో తెలంగాణ రైతులు హెక్టార్‌కు రూ.58,665 నష్టపోతున్నారు. ఓట్లేసి గెలిపిస్తే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ మోసాలకు ఒడిగడుతున్న బిజెపిని నామరూపాల్లేకుండా చేయడం ద్వారానే ఇలాంటి వంచనలకు గురికాకుండా గట్టెక్కగలం. స్వామినాథన్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా (సి2 ప్లస్‌ 50)తో కనీస మద్దతు ధర ప్రతి పంటకూ దక్కేలా చట్టం తీసుకొస్తేనే వ్యవసాయానికి మనుగడ దక్కేది.