విజయనగరం జిల్లాలో ఆదివారం పొద్దు వాలుతున్న సమాయన సంభవించిన ఘోర రైలు ప్రమాదం పదమూడు మంది అమాయకుల ప్రాణాలను కబళించింది. వంద మంది వరకు క్షతగాత్రులను చేసింది. విశాఖ నుంచి పలాస వెళుతున్న ప్యాసింజర్ రైలుకు సిగల్ అందక కంటకాపల్లి సమీపంలో ట్రాక్‌పై నిలిపి ఉంచగా, వెనక నుంచి అదే పట్టాలపై విశాఖ నుంచి రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలు వేగంగా ఢకొీట్టింది. ఆ ధాటికి రాయగడ రైలు కొన్ని బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పక్క ట్రాక్‌లోని గూడ్స్ రైలు మీదికి దూసుకెళ్లాయి. ఈ భీతావహంలో చనిపోయిన వారిలో ఇద్దరు లోకో పైలెట్లు, గార్డు కూడా ఉండటం విషాదం. ముందుగా వెళ్లిన రైలుకు సిగల్ అందని పరిస్థితి ఉండగా వెనుక మరో రైలును అదే ట్రాక్‌పై పంపడం రైల్వే భద్రత డొల్లతనానికి నిదర్శనం. ఇదే రూట్‌లో ఒడిశాలోని బాలాసోర్ వద్ద జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా 1,200 మంది గాయపడ్డారు. ఆ ఘోర కలిని మర్చిపోక ముందే అదే తరహాలో సిగల్ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు గుద్దుకున్నాయి. ఈ నెలలోనే బీహార్‌లో పట్టాలు ఊడిపోవడాన్ని గమనించిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెనుముప్పు తప్పింది. నాలుగు మరణాలు, 70 మందికి గాయాలతో సరిపోయింది. వరుస రైలు ప్రమాదాలతో రైలు ప్రయాణమంటేనే ప్రజలను భీతిల్లజేస్తోంది.
దుర్ఘటన జరిగిన ప్రతిసారీ ప్రముఖుల సంతాపాలు, పరామర్శలు, తృణమో పణమో పరిహారాలు మినహా ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి, కారణాలు కనుగొని, పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తప్పింది. అందుకే పదే పదే ఒకే తరహా ప్రమాదాలు ప్రయాణీకులను బలితీసుకుంటున్నాయి. ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజలను ఏమారుస్తోంది. రైల్వే భద్రత విషయంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని 2022లో విడుదల చేసిన కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దాదాపు రైలు ప్రమాదాలన్నీ పట్టాలు తప్పడం వల్లనే సంభవిస్తున్నాయని, పట్టాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాల్సి ఉండగా, 2017లో ప్రత్యేకంగా నెలకొల్పిన రాష్ట్రీయ రైలు రక్షణ నిధి నిధులు తగ్గించిన వైనాన్ని కాగ్ ఎత్తి చూపింది. అలాగే రైల్వేలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టు ప్రకారం రైలు ప్రమాదాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి సమర్పించిన నివేదికలపై ఎలాంటి చర్యలూ లేవు. ఇదీ ప్రయాణీకుల ప్రాణాలకు మోడీ ప్రభుత్వం ఇచ్చే విలువ. బాలాసోర్ ఘటన విషయానికే వస్తే సిబిఐ దర్యాప్తు చేసి ముగ్గురు అధికారులను అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ వేసి మమ అనిపించింది. కానీ సిగలింగ్ వ్యవస్థ ఏమాత్రం మారలేదని విజయనగరం ఘటన వలన తేటతెల్లమవుతోంది.
కేంద్రంలో బిజెపి వచ్చాక రైల్వేల ప్రైవేటీకరణ దూకుడుగా జరుగుతోంది. వందల ప్రైవేటు రైళ్లొచ్చాయి. అదానీ వంటి కార్పొరేట్లకు రైల్వే ఆస్తులు ధారాదత్తమవుతున్నాయి. రైల్వే ప్రత్యేక బడ్జెట్ ఎత్తేశారు. ప్యాసింజర్ రైళ్లు రద్దవుతూ వందేభారత్, హైస్పీడ్ ట్రైన్లు ప్రవేశపెడుతున్నారు. 2022 చివరి నాటికి రైల్వేలలో మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయాన రైల్వేశాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించారు. రైళ్లల్లో ప్రతి రోజూ రెండున్నర కోట్ల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఒక వైపు రైల్వేల ద్వారా ఏడాదికి రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం ఆర్జిస్తూ మరో వైపు ప్రయాణీకుల భద్రతకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కూడా కేటాయించడం లేదు. సిబ్బంది లేని వేలాది లెవెల్ క్రాసింగ్‌లు పెట్టుకొని బుల్లెట్ రైళ్లనడం మోడీ ప్రభుత్వానికే చెల్లుతుంది. రైలు ప్రమాదాలను మానవ తప్పిదంగానో, కుట్రగానో చిత్రించడం తప్పించుకొనే ఎత్తు. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ రంగ రవాణా వ్యవస్థ మన రైల్వే. అత్యధిక ఉద్యోగులు పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా మన రైల్వేలకు పేరుంది. రైల్వేలపట్ల ప్రభుత్వ విధానాల్లో మార్పు రానంత వరకు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల చందమే. విజయనగరం దుర్ఘటనతోనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మేల్కోవాలి. ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి.