Oct 13,2023 07:55
  • 125 దేశాల్లో 111వ స్థానంలో భారత్‌
  • గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ 2023 విడుదల
  • 2015 నుండి పురోగతి శూన్యం
  • మన తరువాత ఆఫ్ఘనిస్తాన్‌, సబ్‌ సహారా దేశాలు

న్యూఢిల్లీ : పేదరిక నిర్మూలన గురించి, అభివృద్ధి గురించి కేంద్ర ప్రభ్వుత్వం చెబుతున్న మాటల్లోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఏదో ఒకటి తిని కడుపునింపుకోవడానికి కూడా వీలుకాని కటిక పేదరికంలో పెద్ద సంఖ్యలో ప్రజానీకం మగ్గుతున్నారు. గురువారం విడుదలైన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌- 2023 నివేదిక దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆకలికేకల పరిస్తితిని కళ్లకు కడుతోంది. 125 దేశాల ఆకలి సూచిలో భారతదేశం 111వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. గత ఏడాది 121 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా 107వ స్థానంలో మన దేశం నిలిచింది. ఈ ఏడాది నాలుగుదేశాలను ఆదనంగా పరిగణలోకి తీసుకోగా దేశ స్థానం కూడా దిగజారింది తాజా నివేదక ప్రకారం వంద పాయింట్ల స్కేలులో ఆఫ్ఘనిస్తాన్‌, హైతి, సబ్‌ సహారా దేశాల సరసన భారత్‌ నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఆ దేశాల కన్నా కొంచెం మెరుగైన స్థానంలో భారత్‌ ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2015వ సంవత్సరం నుండి దేశ వ్యాప్తంగా ఆకలిపై పోరాటంలో పురోగతి లేదని, ఫలితంగా ఈ పరిస్తితి ఏర్పడిందని వివరించింది. వంద పాయింట్ల స్కేలులో జీరో అంటే అస్సలు ఆకలి బాధలు లేకపోవడమని అర్ధం. వంద అంటే అత్యంత అధ్వాన్నమైన పరిస్థితి. ఈ స్కేలులో భారత్‌ 28.7 స్కోర్‌ వద్ద వుంది. పోషకాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, బరువు తగ్గుదల, బాలల మరణాలు తదితర అంశాలతో కూడిన ఫార్ములా ఆధారంగా జిహెచ్‌ఐ స్కోర్‌ను లెక్కిస్తారు. 2000, 2015 మధ్యలో ఆకలి బాధలను పరిష్కరించడంలో భారత్‌ పనితీరు బాగుందని, ఆ సమయంలో గణనీయమైన విజయాలను సాధించిందని నివేదిక పేర్కొంది. 2వేల సంవత్సరంలో 38.4గా వున్న స్కోర్‌ 2008లో 35.5గా వుండగా, 2015లో 29.2కి చేరింది. గత ఎనిమిదేళ్ళలో కేవలం 0.5పాయింట్లు మాత్రమే తగ్గింది. పోషకాహారం లోపంతో బాధపడే వారి సంఖ్య 2017లో 7.5శాతంగా వుండగా, 2022లో 9.2శాతానికి పెరిగింది. అంటే 73.5 కోట్ల మంది ప్రజలు పోషకాహారం లోపం బారిన పడ్డారు. తీవ్రమైన ఆకలి బాధలను ఎదుర్కొంటున్న దేశాల్లో దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ సహారా ప్రాంతాలు వున్నాయి. వీటి జిహెచ్‌ఐ స్కోర్లు 27గా వున్నాయి.