Nov 14,2023 10:44
  • సహాయ చర్యలు నిలిచిపోతాయన్న ఐరాస
  • సంక్షోభం మరింత ముదురుతోందంటూ ఐక్యరాజ్య సమితి ఆందోళన

గాజా, జెరూసలేం, న్యూయార్క్‌ : గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 101 మంది ఐక్యరాజ్య సమితి సిబ్బంది మరణించారు. వారి మృతికి సంతాప సూచకంగా ఆసియా దేశాల వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి పతాకాలు సగానికి కిందకు దింపి సంతాపం వ్యక్తం చేశారు. మరోపక్క ఇంధన నిల్వలు హరించుకుపోయి విద్యుత్‌ కొరత ఏర్పడడంతో ఆస్పత్రుల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గెబ్రియెసెస్‌ హెచ్చరించారు. నవజాత శిశువులతో సహా అనేకమంది రోగులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్నదానికి నరమేథం అన్న పదం కూడా చిన్నదే అవుతుందని అల్‌-అహ్లి ఆస్పత్రి డైరెక్టర్‌ వ్యాఖ్యానించారు. ఇంధన కొరత కారణంగా గాజాలో వచ్చే 48గంటల్లో మానవతా సహాయక చర్యలు కూడా నిలిచిపోతాయని ఐక్యరాజ్య సమితి సహాయ చర్యల కమిషనర్‌ థామస్‌ వైట్‌ హెచ్చరించారు. విద్యుత్‌ లేకపోవడంతో గాజాలో కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ పూర్తిగా స్తంభించిపోతాయని పాలస్తీనా టెలికం మంత్రి ప్రకటించారు. అదే గనుక జరిగితే పేరా మెడికల్‌ బృందాలెవరూ అటూ ఇటూ కదలడానికి కూడా లేకుండా పోతుందని, దీనివల్ల సంక్షోభం మరింత ముదురుతుందని వైట్‌ హెచ్చరించారు.
          పెద్ద సంఖ్యలో ప్రజల ఆచూకీ గల్లంతవుతోందని, వీరిలో చాలా మంది శిధిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అటువంటి వారి సంఖ్య 3,200కి పైనే వుందని, వీరిలో 1700మంది వరకు చిన్నారులే వుంటారని తెలిపింది. వీరికి అత్యవసర వైద్య చికిత్స అవసరమవుతోందని, కానీ వీరివద్దకు అంబులెన్సులు లేదా పౌర రక్షణ బలగాలు ఏవీ చేరే అవకాశం కూడా లేదని తెలిపింది. గత నెల రోజుల పైనుండి పాఠశాలలు మూతపడ్డాయి. అంతర్గత నిర్వాసితల కోసం స్కూళ్లను ఆశ్రయాలుగా మార్చారు. మరోవైపు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై అనేక దాడులు చేపట్టినట్లు ఇజ్రాయిల్‌ వైమానిక బలగాలు తెలిపాయి. తాము కూడా ఇజ్రాయిల్‌ బలగాలపై యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపినట్లు హిజ్బుల్లా తెలిపింది. కొంతమంది మరణించారని వెల్లడించింది. దీనిపై ఇజ్రాయిల్‌ మిలటరీ వెంటనే వ్యాఖ్యానించలేదు.