
కాదేదీ కవితకనర్హం అన్నట్లుగా మతం రంగు పులిమే విషయంలో మోడీ ప్రభుత్వానికి, బిజెపి, పరివారానికి ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు. చంద్రయాన్-3 సక్సెస్‌నూ వదలడం లేదు. చంద్రయాన్ విజయానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు సాగించిన కృషి అసామాన్యమైనది. కాగా ఈ సందర్భానికి సైతం మతాన్ని అంటగట్టడం, తమ ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకోవడం, ఎన్నికల్లో రాజకీయ లబ్ధికి ప్రధాని మోడీ, ఆయన పార్టీ ఆరాట పడటం అభ్యంతరకరం. దేశ ప్రధానిగా చంద్రయాన్ వంటి ప్రయోగాన్ని సాకారం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడాన్ని, శాల్యూట్ చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఇక్కడ మోడీ చేసిన విన్యాసాలే విస్తుగొల్పుతాయి. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాలకు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన మోడీ, అక్కడి నుంచి నేరుగా బెంగళూరులోని ఇస్రోకు వేకువజామునే వెళ్లి సైంటిస్టులను కలుసుకోవడం పక్కా ప్రచారం కోసమే. అంతేనా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననివ్వలేదు. అక్కడ కాంగ్రెస్ సర్కారు ఉంది కాబట్టే మోడీ ప్రొటోకాల్‌ను పాటించలేదని అర్థమవుతూనే ఉంది.
చంద్రుడిపై విక్రమ్ లాంచర్ అడుగిడిన ప్రాంతానికి 'శివ శక్తి' పేరుపెట్టడం మతతత్వ ఎజెండాలో భాగమే. ఒక వైపు శాస్త్ర విజ్ఞాన విజయాలను వేనోళ్ల కీర్తిస్తూనే మరో వైపు ఒక మత ప్రమేయంతో ముడిపడిన పేరు పెట్టి సైన్సును, శాస్త్రవేత్తలను, చివరికి రాజ్యాంగాన్ని మోడీ ఘోరంగా అవమానించారు. అదే చేత్తో ప్రజల, భావి భారత పౌరుల మెదళ్లలో మత బీజాలు నాటేందుకు ఒడిగట్టారు. ఒక లౌకిక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్ఞాన ప్రయోగాలకు ఒక మతానికి చెందిన దేవుళ్ల పేర్లు పెట్టడం తగని పని. ప్రాచీన కాలంలో ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించింది మన ఆర్యభట్ట. మన ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట పేరు పెట్టారు. అప్పుడు బిజెపి సర్కారు అధికారంలో ఉండి ఉంటే ఏ దేవుడి పేరు పెట్టేవారో? ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన మహనీయుల పేర్లు పెట్టడం ఆనవాయితీ. మన రాష్ట్రంలోని శ్రీహరికోట స్పేస్ సెంటర్‌కు సతీష్ ధావన్, తిరువనంతపురంలోని ఇస్రో కేంద్రానికి విక్రమ్ సారాభాయి పేరు పెట్టిందీ ఆ ఆనవాయితీతోనే. చంద్రుడిపై విక్రమ్ లాంచర్ తొలి అడుగులను రామాయణంలోని 'అంగథ్' అడుగులతో మోడీ పోల్చడమూ మత ఎజెండాతోనే. ఇక చంద్రుడిపై 2019లో చంద్రయాన్-2 లాంచర్ కూలిపోయిన ప్రదేశానికి 'తిరంగ' పేరు పెట్టారు మోడీ. పడిపోయిన ప్రదేశానికి జాతీయ జెండా పేరు, సక్సెస్ ప్లేస్‌కు మతం పేరు పెట్టడంలోనే వారి చిత్తశుద్ధి కనిపిస్తుంది.
ప్లాస్టిక్ సర్జరీలు మొదలుకొని కరోనా మందు వరకు అన్నీ వేదాల్లో ఉన్నాయని మోడీ, బిజెపి, పరివారం ప్రచారం చేయడం చూస్తున్నాం. గ్రహాల సంచారం బట్టి మనుషుల భూత, వర్తమాన, భవిష్యత్తు నిర్ణయించబడతాయనే జ్యోతిష్యాన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనాంశం చేస్తున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రాలను సర్వరోగ నివారిణిగా చెబుతున్నారు. శాస్త్ర విజ్ఞానం దండగ అంటున్నారు. వారే చంద్రయాన్‌ను భుజానేసుకోవడం పూర్తి భిన్నం. సందర్భం ఏంటనేది కాదు ప్రచారం, రాజకీయ లబ్ధే బిజెపి టార్గెట్. మోడీ జమానాలో స్పేస్ టెక్నాలజీలోనూ ప్రైవేటీకరణ మొదలైంది. పరిశ్రమగా చూడమంటున్నారు. వ్యాపారంలో భాగంగా ఇతర దేశాల ఉపగ్రహాలను ఇక్కడ ప్రయోగిస్తున్నారు. వాటి వెనుక సామ్రాజ్యవాద దేశాల ఒత్తిడి లేకపోలేదు. గతంలో పని చేసిన ఒక ఇస్రో ఛైర్మన్‌పై అవినీతి ఆరోపణలొచ్చాయి. కొంత మంది ఛైర్మన్లు ప్రయోగాలకు ముందు గుళ్లు గోపురాలు సందర్శించి సైన్సును చులకన చేశారు. వేదాల్లోనే ఉన్నాయంటూ ప్రస్తుత ఛైర్మన్ సోమనాథ్ ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విదేశాల్లో ఉన్నా మనసంతా చంద్రయాన్ పైనేనన్న మోడీ ప్రభుత్వమే ఆ ప్రయోగం సక్సెస్‌కు అహర్నిశలు పని చేసిన రాంచీ హెచ్‌ఎఫ్‌సి ఇంజనీర్లు, సిబ్బందికి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇదీ చంద్రయాన్ విజయానికి కృషి చేసిన వారిపై మోడీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ. మన ఇస్రో సూర్యునిపై అధ్యయనానికి సిద్ధమవుతోంది. మరిన్ని గ్రహాలపై ప్రయోగాలకూ సై అంటోంది. శాస్త్ర విజ్ఞానం విశ్వ మానవాళి అభివృద్ధికి ఉపయోగపడాలి. ఇక్కడ మానవ మేధస్సుకు తప్ప పుక్కిటి పురాణాలకు, మతానికి తావివ్వడం తగని పని.