
తరగతి గదిలో పిల్లలందరూ బాగా గోల చేస్తున్నారు. అప్పుడే లెక్కల మాస్టారు క్లాసుకు వచ్చారు. ఆయన వస్తూనే 'పిల్లలూ ఈ రోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందాం. ఒక రోజు ఈ బడిని మీకు అధికారంగా అప్పజెప్తే మీరేం చేస్తారు? అని అన్నారు. 'పిల్లలందరూ రకరకాలుగా సమాధానాలు ఇస్తున్నారు. పిల్లలను క్రమ శిక్షణలో పెడతాను. తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల మాటలు వినాలని చెబుతాను. ఆడపిల్లలను అక్కగా చెల్లిగా భావించాలి అని చెబుతాను. పర్యావరణం కాపాడాలి అని, దేశ నాయకులను గౌరవించాలి అని చెబుతాను. టీవీలు సెల్ ఫోన్‌లు ఎక్కువ చూడకూడదు అని చెబుతాను, బాగా చదువుకోవాలని అంటాను' అని అందరూ తలో రకంగా చెబుతున్నారు. అప్పుడు వరుణ్ అనే విద్యార్థి లేచి 'నాకే బడి అధికారం ఇస్తే పాఠశాల ఆవరణ ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుతాను' అని చెప్పేసరికి పిల్లలందరు నవ్వారు.
వరుణ్ మాత్రం తడబాటు పడకుండా 'మన బడిలో ఖాళీ స్థలం చాలా ఉంది. ఇప్పుడు అదంతా చెత్తతో నిండి పోయి ఉంది. అలా ఉండటం వలన చాలా మంది అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. రాత్రి పూట చుట్టుపక్కల వాళ్లు చెత్త వేస్తున్నారు. దీంతో కుక్కలు, పందులు బడిలోకి వస్తున్నాయి. దోమలు కూడా ఎక్కువయ్యాయి. అవి కుట్టడం వల్ల విద్యార్థులు అనారోగ్యం గురవుతున్నారు. అలా కాకుండా ఆ స్థలం శుభ్రం చేసి, మొక్కలు పెంచితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతాం' అని చెప్పాడు. వరుణ్ మాటలను శ్రద్దగా విన్న పిల్లలంతా చప్పట్లు కొట్టారు. చిన్న వయసులోనే పర్యావరణాన్ని కాపాడాలన్న స్పృహ ఉన్న వరుణ్‌ని మాస్టారు అభినందించారు. ఆ రోజే ఆ స్థలం శుభ్రం చేయించారు. పిల్లలంతా కూరగాయలు, పూల మొక్కలు నాటారు. మొక్కల సాగులో పిల్లలు అల్లరి చేయడం మానేశారు. పాఠాలు శ్రద్దగా వింటున్నారు. క్రమక్రమంగా బడి ఆవరణం మొత్తం పచ్చ తోరణంగా మారిపోయింది.
నల్లపాటి సురేంద్ర,
94907 92553.