ప్రజాశక్తి - పుత్తూరు టౌన్(తిరుపతి) : ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంతో పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. పుత్తూరు మండలం తడుకు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ కే.వెంకట రమణ రెడ్డితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రాంరభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. డాక్టర్, నర్సులు అంటే వారు దేవుళ్ళు, దేవతలతో సమానమని అన్నారు. విద్యా, వైద్యం అభివృద్ధి చేస్తే విద్య ద్వారా మెరుగైన జీవితం ఉంటుందని నమ్మిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. కులాన్ని మతాన్ని చూడకుండా రాష్ట్రాన్ని అభివద్ధి చేస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి భారత దేశంలోనే అత్యంత ప్రాధాన్యత వినూత్నమైన వైద్య విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఫ్యామిలీ డాక్టర్ విధానం అనే మహౌన్నత కార్యక్రమం నేడు ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం, లింగం గుంట్ల గ్రామం నుండి లాంఛనంగా ప్రారంభించబడి జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామంలోనే వైద్యం అందుబాటులో ఉండేలా ప్రతి 2 వేల మందికి వై.ఎస్.ఆర్. విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుతో, ప్రజల గడప వద్దకే వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా జిల్లాలోని 439 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల పరిధిలోని సచివాలయలను కవర్ అయ్యేలా, ప్రతి సచివాలయ పరిధిలో నెలకు రెండు సార్లు 104 వాహనాలు పర్యటించి వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. సమావేశానికి ముందు ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభిస్తూ. ఉప ముఖ్యమంత్రి బిపి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డి ఎంహెచ్‌ఓ శ్రీహరి, డిసిహెచ్‌ఎస్ ప్రభావతి, తహశీల్డారు రోశయ్య, ఎంపిడిఓ ఇందిరమ్మ. ఎంపీపీ మునివేలు, సర్పంచ్ వెంకటేష్, డాక్టర్ హనుమంత రావు, చైతన్య, హేమభూషన్, ప్రవీణ్ ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.










