Oct 11,2023 09:44

న్యూయార్క్‌ : గాజాను దిగ్బంధిస్తూ ఇజ్రాయిల్‌ జరుపుతున్న వరుస దాడులను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ చీఫ్‌ వోల్కర్‌ తుర్క్‌ మంగళవారం ఖండించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇలాంటి దిగ్బంధనాలు చట్టవిరుద్ధమని అన్నారు. ప్రజలను అపహరించి బందీలుగా వుంచడం కూడా అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్దమని అన్నారు. గాజాలో ఆహార, వైద్య సరఫరాలను అందకుండా చేయడంకూడా యుద్ధ నేరం కిందకే వస్తుందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రతినిధి రవీనా షామ్‌దాసాని వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని ఐక్యరాజ్య సమితి నియమించిన విచారణా కమిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. గాజా నుండి ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది ఇళ్లను వీడినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా కార్యాలయ ప్రతినిధి తెలిపారు. విద్యుత్‌, ఆహారం, నీరు, ఇంధనం ఇలా నిత్యావసరాలేవీ లేకుండా గాజాను దిగ్బంధించడం పట్ల యునిసెఫ్‌ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
 

                                                         ఇద్దరు హమాస్‌ నేతల మృతి

దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఖాన్‌ యూనిస్‌ వద్ద జరిగిన వైమానిక దాడిలో హమాస్‌ పొలిటికల్‌ ఆఫీస్‌కి చెందిన ఇరువురు సభ్యులు మరణించారని ఆ గ్రూపునకు చెందిన అధికారి తెలిపారు. ఇజ్రాయిల్‌ ఓడరేవు నగమైన అష్‌కెలాన్‌ను మంగళవారం సాయంత్రం ఐదు గంటల కల్లా వీడి వెళ్ళాల్సిందిగా హమాస్‌ సాయుధ విభాగ ప్రతినిధి ప్రజలను కోరారు.
 

                                                                        చైనా ఖండన

హమాస్‌-ఇజ్రాయిల్‌ ఘర్షణలో పౌరులకు హాని కలిగించే చర్యలను చైనా తీవ్రంగా ఖండించింది. తక్షణమే కాల్పుల విమరణ జరపాలని కోరింది. పాలస్తీనా, ఇజ్రాయిల్‌ పక్షాల మధ్య జరుగుతున్న ఘర్షణల పట్ల చైనా తీవ్రంగా ఆందోళన చెందుతోందని మధ్య ప్రాచ్యంపై చైనా ప్రత్యేక దూత ఝాయి జున్‌ తెలిపారు. కాగా తాజాగా చెలరేగిన ఘర్షణలు చూస్తుంటే మధ్య ప్రాచ్యంలో అమెరికా రాజకీయాలు విఫలమయ్యాయని రుజువవుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు.
 

                                                      భారత్‌ది కీలక పాత్ర : పాలస్తీనా దూత

పాలస్తీనా ప్రయోజనాలకు భారత్‌ మద్దతివ్వడమనేది మహాత్మా గాంధీ కాలంనుండి వుందని, పైగా అంతర్జాతీయంగా భారత్‌ ఎదుగుతున్న తీరు, పశ్చిమాసియాలో కీలక పక్షాలను ప్రభావితం చేయగల సత్తా ఇవన్నీ కలిసి భారత్‌ కీలక పాత్ర పోషించడానికి దోహదపడతాయని పాలస్తీనా రాయబారి అదన్‌ అల్హాజియా మంగళవారం వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు భారత్‌ మిత్ర దేశమని, ఉద్రికత్తలు తగ్గించే, పాలస్తీనా సమస్యకు పరిష్కారం అందించే దిశగా కృషి చేసేందుకు అర్హత వుందని అన్నారు.
 

                                                            భిన్నమైన వైఖరితో మోడీ సర్కార్‌

పాలస్తీనా ప్రజానీకానికి భారత్‌ ఎప్పటి నుంచో అండగా ఉంటోంది. కానీ మితవాద ధోరణులతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్న వైనం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. యుద్ధోన్మాదం రగిలిపోతున్న అమెరికాకు వంత పాడుతున్న మోడీ సర్కార్‌ ఇప్పుడు ఇజ్రాయిల్‌కు అండగా నిలుస్తామని చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధవాతావరణంలో తమకు అండగా నిలువాలంటూ ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు మంగళవారం నాడు భారత ప్రధాని మోడీకి ఫోన్‌ చేశారు. దీనిపై స్పందించిన మోడీ..ఇజ్రాయిల్‌కు అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు. తీవ్రవాదం ఏ రూపంలో వున్నా భారత్‌ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

                                                   పాలస్తీనాకు సంఘీభావంగా దేశ దేశాల్లో ప్రదర్శనలు

వాషింగ్టన్‌: ఇజ్రాయిల్‌లో హమాస్‌ భారీ సాయుధ ఆపరేషన్‌ తరువాత ఇజ్రాయిల్‌ దళాలు గాజా స్ట్రిప్‌ను దిగ్బంధనం చేస్తూ , భీకర వైమానిక దాడులు కొనసాగించడానికి వ్యతిరేకంగా అరబ్‌ దేశాల్లోనే కాదు, అమెరికా, బ్రిటన్‌ వంటి పశ్చిమ దేశాల్లోనూ పెద్ద యెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
            పాలస్తీనాకు సంఘీభావంగా అమెరికాలోని న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో, లాస్‌ఏంజెల్స్‌, అట్లాంటాతో సహా పలు నగరాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. బ్రిటన్‌ రాజధాని లండన్‌లోనూ పెద్దయెత్తున ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని ఇజ్రాయిల్‌ దౌత్యకార్యాలయం ఎదుట వందలాది మంది నిరసన ప్రదర్శన జరిపారు. పాలస్తీనీయులకు నీరు, ఆహారం, ఇంధనం వంటివి ఏవీ అందకుండా అన్ని మార్గాలను దిగ్బంధించడాన్ని, తెల్ల భాస్వరం వంటి ప్రమాదకరమైన రసాయనాన్ని ఆయుధంగా చేసుకోవడాన్ని వారు ఆక్షేపించారు.
       బొలీవియాలో లాపాజ్‌లోని అమెరికన్‌ ఎంబసీ వెలుపల వేలాది మంది గుమికూడి పాలస్తీనాకు తమ సంఘీభావం తెలియజేశారు. టర్కీ,ట్యునీసియా, కువైట్‌, మొరాకల్లో పాలస్తీనా యాక్షన్‌ గ్రూపు ఆధ్వర్యంలో వేలాదిమంది వీధుల్లోకి వచ్చి తమ సంఘీభావం తెలిపారు.