Nov 06,2023 08:27

- అంబేద్కర్‌ విగ్రహం వద్ద వంటావార్పుతో బాధితుల నిరసన
- నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌
ప్రజాశక్తి -పోరుమామిళ్ల (కడప):తమ ఇళ్లను కూల్చిన తహశీల్దార్‌ గంగయ్యను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పేదలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఆదివారం సిపిఎం మండల కార్యదర్శి బైరవ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి అన్వేష్‌ మాట్లాడారు. ప్రభుత్వం జిబి (గుంటూరు బాపనయ్య) నగర్‌ కాలనీలో నివాసం ఉన్న పేదలకు పట్టాలు మంజూరు చేయకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. అప్పుసొప్పు చేసి కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని అన్నారు. కూల్చిన ఇళ్లకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రంగసముద్రం రెవెన్యూ పొలంలో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించడం, బోగస్‌ పట్టాలు సృష్టించడం, ప్లాట్లు వేసి చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం తగదన్నారు. పేదల ఇళ్లను కూల్చిన రెవెన్యూ అధికారి వైఖరికి నిరసనగా సోమవారం తహశీల్దార్‌ కార్యాలంయ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాధితులు గురమ్మ, లక్ష్మి దేవి, సుధాకర్‌ ,రమణయ్య, నాగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్‌, అవాజ్‌ జిల్లా అధ్యక్షుడు చాంద్‌ బాషా కాలనీవాసులు పాల్గొన్నారు.