ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయాయి. గత ఆరు నెలల వ్యవధిలోనే సుమారు 30 శాతం మేర ధరలు పెరిగాయి. దీనికితోడు ఆభరణాల విక్రయాలూ మందగించాయి. దీంతో, తయారీ వ్యయానికి అనుగుణంగా వాటి ధరలు పెంచుకునే అవకాశం లేకుండాపోయిందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి వ్యయం పెరగడం, టర్నోవర్ తగ్గడంతో పరిశ్రమ నిర్వహణ భారంగా మారిందని నిర్వా హకులు వాపోతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోతేపల్లిలోని ఇమిటేషన్ జ్యూయలరీ పార్కులో రోల్డ్‌గోల్డ్ తయారీ యూనిట్లు 236 ఉన్నాయి. ఈ పరిశ్రమ నిర్వహణ ఖర్చుల్లో 60 శాతం మెటీరియల్‌కే పోతుంది. 25 శాతం వర్కర్ల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు వెచ్చిస్తారు. హోల్‌సేల్ విక్రయాల్లో పరిశ్రమ టర్నోవర్‌లో 15 శాతం ఆదాయ మిగులుగా నిర్వాహకులు చూపుతాయి. ఇటీవల కాలంలో వర్కర్లకు ఇచ్చే వేతనాలు, పీస్ వర్కు ఆర్డర్లలో ఎటువంటి పెరుగుదలా లేదు. ఆభరణాల తయారీకి ఉపయోగించే కాపర్, కాపర్ సాల్ట్, కాపర్ బ్రైట్‌నర్, లేకర్ (ఆభరణంపైన వేసే కోటింగ్), నికిల్ సాల్ట్, నికిల్ బ్రైటనర్ తదితర మెటీరియల్స్ ధరలు ఆరు నెలల కాలంలో భారీగా పెరిగాయి. గతేడాది జూన్‌లో కిలో రూ.750 ఉన్న కాపర్ ధర ఈ ఏడాది జనవరి నెలాఖరకు రూ.820కు పెరిగింది. నికిల్ రూ.1800 నుంచి రూ.3 వేలకు, కాపర్ సాల్ట్ రూ.190 నుంచి రూ.310కు, కాపర్ బ్రైట్‌నర్ రూ.900 నుంచి రూ.1300కు, నికిల్ సాల్ట్ రూ.550 నుంచి రూ.650కు ధర పెరిగిపోయింది. జ్యూయలరీ పార్కులోని పరిశ్రమలు గతంలో ఏడాదికి రూ.60 కోట్లు మేర మెటీరియల్‌కు ఖర్చు పెట్టగా, ఇప్పడు అది పెరిగిన ధరలతో రూ.85 కోట్లకు చేరింది.
- పెరిగిన ఖర్చు
ముడి పదార్థాల ధరలు, కార్మికుల వేతనాలు, పెట్టుబడి, నిర్వహణ వ్యయం, మిగులు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని తయారయ్యే ఆభరణాల ధరలను పరిశ్రమల నిర్వాహకులు నిర్ణయిస్తారు. గతంలో రూ.1600కు తయారైన వన్ గ్రామ్ గోల్డ్ వడ్డాణ్ణం వ్యయం రూ.2 వేలు, రూ.4 వేల వ్యయమైన పెళ్లి కూతురు అలంకరణ ఆభరణాలు సెట్ రూ.5 వేలకు పెరిగింది. ఆభరణాలపై గతంలో మార్జిన్‌గా మిగిలే మొత్తాన్ని ఇప్పుడు మెటీరియల్‌కే ఖర్చు చేయాల్సి వస్తోందని పరిశ్రమల నిర్వాహకులు వాపోతున్నారు.
- వడ్డీలేని రుణాలివ్వాలి
రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలో కార్మికులకు ఇచ్చే వేతనాలు, నిర్వహణ వ్యయం పెరగలేదు. మెటీరియల్ ధరలే భారీగా పెరిగాయి. మార్కెట్లో విక్రయాలు తగ్గిపోయాయి. ధర పెంచితే విక్రయాలు మరింత తగ్గిపోతాయని నిర్వాహకులు భయపడుతున్నారు. దీంతో, పెరిగిన ధరలకనుగుణంగా తయారైన ఆభరణాల ధరలు పెంచలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తే కాస్త ఊరట లభిస్తుంది.
- అంకెం జితేంద్ర, ఇమిటేషన్ జ్యూయరీ పార్కు కార్యదర్శి, పోతేపల్లి, మచిలీపట్నం










