Sep 27,2023 10:51

ఇటీవల ఎక్కడ చూసినా ఒకటే పాట.. 'లింగి లింగి లింగిడి'. శ్రీకాకుళం యాసలో సాగే ఈ పాట సోషల్‌ మీడియాలో ఎవరూ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ... ఇలా ఏది తెరిచినా ఇదే ట్రెండింగ్‌లో ఉంది. ఇంతలా ఆదరణ పొందిన ఆ పాటను పాడింది పేదింటి కుర్రాడు పాలవలస రఘు. ఓ వైపు చదువుకుంటూనే పాటే ప్రాణంగా, జానపదమే ఊపిరిగా బతికాడు. తనదైన ప్రత్యేక యాస, గాత్రంతో ముందుకురికి ఈ రోజు జనం నోళ్లలో పాటై నానుతున్నాడు.

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాత బగ్గాం రఘు స్వగ్రామం. తల్లిదండ్రులు ముత్యాలు, బంగారమ్మ. బుట్టలు, తట్టలు అల్లుకుని ఊరువాడా తిరిగి అమ్ముకునే గిరిజన తెగకు చెందిన కుటుంబం. రోజంతా కష్టిస్తేనే కడుపు నిండేది. రఘు ప్రాథమిక విద్యను మెంటాడ మండలంలోని కారు మామిడివలసలో అభ్యసించాడు. 6 నుంచి 10వ తరగతి వరకూ మెంటాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనూ, ఇంటర్‌ గజపతినగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోనూ, డిగ్రీ గాయత్రీ కళాశాలలోనూ, బిఇడి జామి సమీపంలోని శోభా మెమోరియల్‌ కాలేజీలోనూ రఘు చదివాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును వీడిపోలేదు.
 

                                                                      తెలుగు పద్యంతో మొదలెట్టి..

రఘు మెంటాడలో ఆరో తరగతి చదువుతున్నప్పుడు తెలుగు మాస్టారు శంకరరావు ఓ పద్యాన్ని పాడగా రఘు దాన్ని అందుకుని మరింత వినసొంపుగా పాడాడు. 'నీ గొంతులో ఏదో మ్యాజిక్‌ ఉంది' అని తెలుగు మాస్టారు, స్నేహితులు మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోలు మెంటాడకే చెందిన కళాకారుడు డొంకాడ రామ్మోహనరావు వరకూ చేరింది. ఆయన ఆ ప్రాంతంలో పేరొందిన హార్మోనిస్టు. ఎన్నో కళాబృందాలను తీర్చిదిద్దాడు. తెలిసిందే తడవుగా రఘును చేరదీసి బుర్రకథలు ఆడి, పాడటం నేర్పించాడు. రఘు అన్నయ్య ఈశ్వరరావు కూడా ఇక్కడే బుర్రకథ నేర్చుకున్నాడు. రామ్మోహనరావు సారథ్యంలో ఈశ్వరరావు హాస్యగాడిగా, రఘు సెంటరోడిగా, ఇద్దరు మహిళా కళాకారులు ఇతర పాత్రధారులుగా బాలనాగమ్మ బుర్రకథ బృందం ఏర్పడింది. ఉత్తరాంధ్రలోని చాలా గ్రామాల్లో, ఒడిశాలోని రాయఘడ ప్రాంతంలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు 3 వేల చోట్ల ఆడి పాడి ప్రేక్షకులను అలరించారు.
 

                                                                          పాటే బతుకు బాటగా ...

బుర్రకథ కళాకారునిగా మంచి పేరు వస్తున్న సమయంలో 2008లో రఘు అన్నయ్య ఈశ్వరరావు చనిపోయాడు. ఆ మనేదతో మరుసటి సంవత్సరమే తండ్రి కన్నుమూశాడు. దీంతో కుటుంబ భారమంతా రఘుపైనే పడింది. పాటే బతుకు బాటగా మారింది. 2015లో రఘు రేలారే రేలా పేరిట బృందాన్ని తయారు చేసుకున్నాడు. అనతికాలంలోనే ఈ బృందానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఓ దినపత్రికలో వచ్చిన ప్రకటనను రఘు చూశాడు. 'నవ్వించే సత్తా మీకుంటే ఇదే సదావకాశం' అంటూ స్టార్‌ మా ఛానల్‌ యాజమాన్యం తాను రూపొందిస్తున్న 'గ్రేట్‌ తెలుగు లాఫ్టర్‌ ఛాలెంజ్‌' వీక్లీ షో ప్రకటన అది. తెలుగు రాష్ట్రాల నుంచి 18 వేల మంది ఆడిషన్స్‌కు హాజరవ్వగా, 14 మంది ఫైనల్‌కు ఎంపికయ్యారు. అందులో రఘు ఒకడు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మెయిన్‌ గెస్ట్‌గా శని, ఆదివారాల్లో ఆ షో స్టార్‌ మాలో ప్రసారమయ్యేది. అందులో చివరిగా ఓ జానపద గీతం కచ్చితంగా ఉండేది. ఆ పాటను రఘుతోనే పాడించేవారు. ఇలా హాస్యగానిగా, గాయకునిగా ముందుకెళ్తున్న తరుణంలో అనివార్య కారణాలతో ఆ షో నిలిచిపోయింది. రఘు తీవ్ర నిరాశ చెందాడు.
           2020లో గాయని మంగ్లీ యాంకర్‌గా, గోరటి వెంకన్న, విమలక్క జడ్జిలుగా నిర్వహించిన జానపద గీతాల పోటీల్లో పాల్గొన్నాడు. ఫైనల్‌కు చేరాడు. 2021లో ఈటీవీలో ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఉత్తరాంధ్ర జానపదాలతో దుమ్ములేపాడు.
 

                                                                        సినిమాల్లో పాటలు ఇలా..

2022లో డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మా నాన్న నక్సలైటు సినిమాలో రఘు 'బుడి బుడి అడుగులతో కొడుకో నా కొడుకో.. గుండెమీద నువ్‌ తంతే కొడుకో నా కొడుకో' అన్న పాటను పాడాడు. ఆ సినిమా తెలంగాణకే పరిమితమవడంతో తగినంత గుర్తింపు రఘుకు రాలేదు. 'పలాస' సినిమాలో నక్కిలీసు గొలుసు, బావొచ్చాడోలప్పా.. బావొచ్చాడు అన్న పాటలను తొలుత ట్రయల్స్‌లో రఘుతో పాడించారు. వాటికి సంబంధించిన లిరిక్స్‌, ఇతర ఆధారాలు అన్నింటినీ ఆ సినిమా దర్శకునికి రఘు అప్పగించాడు. ఆ తరువాత ఏం జరిగిందోగానీ వేరొకరితో ఆ పాటను పాడించి సినిమా విడుదల చేశారు. రఘు బృందం తీవ్ర నిరాశ చెందింది. సినిమా రంగంలో ఇవన్నీ సాధారణమే అని తమలో తాము సర్దిచెప్పుకున్నారు. ఈ క్రమంలోనే రఘు టాలెంట్‌ను గుర్తించి కోటబొమ్మాళి పిఎస్‌ సినిమా దర్శకుడు తేజ మార్ని తన చిత్రంలో పాడే అవకాశం కల్పించాడు. 'లింగి లింగి లింగిడి' అంటూ శ్రీకాకుళం యాసలో మంచి ఊపుతో సాగే ఈ పాటకు మాంచి మ్యూజిక్‌ తోడవడంతో విశేష ఆదరణ దక్కుతోంది. వాస్తవానికి ఈ పాటను రఘు 2019 నుంచి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాడు. ఇప్పుడు సినిమా అవసరాలకు తగ్గట్టు కొన్ని ముక్తాయింపులను ఇతరుల నుంచి తీసుకుని వాటికి అందమైన అక్షర రూపమిచ్చి పాడాడు.
 

                                                                    ప్రభుత్వ సహకారం కరువాయె..

రఘు దశాబ్దానికిపైగా కళారంగంలో రాణిస్తూ.. వందలాది వేదికలపై వేలాది బుర్రకథలు చెబుతూ, జానపద గేయాలు ఆలపిస్తూ.. జనాన్ని అలరిస్తున్నా ప్రభుత్వం నుంచి అతనికి ఎటువంటి సాయమూ అందలేదు. ఉత్తరాంధ్ర జానపదాలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్తున్న అతనికి ప్రజాప్రతినిధుల నుంచి, సాంస్కృతిక, కళా శాఖల నుంచి ప్రోత్సాహం కరువైంది. రఘు తన ఇంట్లోనే ఓ గదిని స్టూడియోగా మలుచుకున్నాడు. మ్యూజిక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుని తన బృందంతో కొత్త కొత్త పాటలను జనంలోకి తెస్తున్నాడు. రఘు టివి పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను పెట్టి జానపద గీతాలు వదులుతున్నాడు. తనలాంటి పేద కళాకారులకు తెలుగు సాంస్కృతిక, కళా విభాగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకుంటే బాగుంటుందని, కళను మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లే వీలుంటుందని రఘు అంటున్నాడు.
 

- కోడూరు అప్పల నాయుడు
94915 70765