
తెలంగాణ : బిఆర్‌ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాహనాన్ని ఆపకపోవటంతో వారంతా వెంబడించి అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద వాహనాన్ని అడ్డుకొని రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరనన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనంపై దాడి సరికాదని బిఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.