Aug 28,2023 09:19

గడ్డ పెరుగు కమ్మదనం
తెలుగు భాష ఆనందం
తేనె లొలుకు తీయదనం
తెలుగు భాషకే సొంతం

అచ్చులతో అంతమయ్యే
అజంతా భాష తెలుగు
పొడుపు కథల మర్మంతో
పదును పెట్టు మన తెలుగు

ముత్యాలను మురిపించే
అక్షరాల అందం తెలుగు
తెలుగు తల్లి మెడలో
మల్లెపూల దండ తెలుగు

అల్లూరి పౌరుషంలో
ఉద్వేగం తెలుగు
కాకతీయ రుద్రమ్మ
ధైర్యమే తెలుగు
గోదావరి కృష్ణమ్మ
పరవళ్ళు తెలుగు
అన్నమయ్య కీర్తనలో
పరవశించిన తెలుగు

చిన్నారి ముద్దు పలుకులకు
సొబగులు అద్దిన తెలుగు
గిడుగు వ్యవహారికమై
జనావళికి చేరువైన తెలుగు

సామెతల నుడికారాల
మెరుపు తెలుగు
పద్య గద్యాలలో
ఒదిగిన తెలుగు

మనసైన మన తెలుగు
శతకోటి రతనాల జిలుగు
అన్య భాష వారు మెచ్చిన తెలుగు
జగతికి అందించు వెలుగు

- మొర్రి గోపి,
88978 82202