Sep 10,2023 10:12

'తాతయ్య! నాకు తెలుగు భాష గురించి వ్యాసం రాసి ఇవ్వాలి. మా పాఠశాలలో భాషోత్సవాలు నిర్వహిస్తున్నారు. రేపు 'తెలుగు భాష ... వెలుగు భాష' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు' అని 7వ తరగతి చదువుతున్న చరణ్‌ తన తాతయ్య రామంని అడిగాడు.
అప్పుడు 'ఒరేరు చరణ్‌.. నేను రాసి ఇస్తే, నువ్వు నేర్చుకునేదేంటి? నువ్వే సొంతంగా రాయాలి' అని తాతయ్య అన్నారు. 'నాకేం తెలుసు తాతయ్య! తెలుగు గురించి!' అన్నాడు చరణ్‌.
''నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రతిరోజూ తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగు వింటున్నావు, మీ పాఠశాలలో తెలుగు పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయంలో కథల పుస్తకాలు చదువుతున్నావు. నీకు మన తెలుగు భాష ఏమనిపిస్తుందో అదే వ్యాసంగా రాయి.'' అని తాతయ్య ఇచ్చిన సలహా చరణ్‌కి బాగా నచ్చింది.
ఆలస్యం చేయకుండా తనకు తెలిసిన తెలుగు భాష గురించి వ్యాసం రాశాడు. తర్వాత రోజు వ్యాసరచన పోటీలో పాల్గొన్నాడు. 'మన మాతృభాష తెలుగు మాధుర్యం చందమామ వెన్నెల చల్లదనం, అమ్మ ప్రేమ వలే అమృతం. ఎటువంటి విషయమైనా మాతృభాషలో నేర్చుకుంటే మనసుకు హత్తుకుంటుంది. మన జీవనానికి వెలుగు నింపే దిశగా మాతృభాష నడుపుతుంది' అని చరణ్‌ రాసిన వ్యాసాన్ని స్కూలు ప్రిన్సిపాల్‌ పిల్లలందరి ముందూ చదివారు.
తెలుగు భాషోత్సవం నాడు వ్యాసరచన పోటీలో చరణ్‌కి ప్రథమ బహుమతి ఇచ్చారు. సొంతంగా తన ఆలోచనతో రాసిన వ్యాసానికి బహుమతి రావడంతో చరణ్‌ చాలా ఆనందించాడు.
- మొర్రి గోపి
88978 82202