
- నదీ జలాలు పంపిణీ, ఎస్‌సి వర్గీకరణపై నో క్లారిటీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రకటించిన మేనిఫెస్టోలో స్పష్టత కరువైంది. ఎస్‌సి వర్గీకరణ చేపడతామని స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఇటీవల సికింద్రాబాద్‌లో నిర్వహించిన సభలో ప్రకటించినప ్పటికీ.. బిజెపి మేనిఫెస్టోలో దానిపై ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంతర్రాష్ట్ర జలవివాదాలపై కూడా మేనిఫెస్టోలో బిజెపి క్లారిటీ ఇవ్వలేదు. డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని దేశ ప్రజలు ఆందోళనలు చేసినా పట్టించుకోని బిజెపి..తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని ప్రకటించింది. ప్రజలకు ప్రధానమైన విద్య, వైద్యం విషయంలో స్పష్టమైన విధానాలను బిజెపి ప్రకటించలేదు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలనే ఇక్కడ కూడా వల్లెవేసింది. వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై బిజెపి ఇచ్చిన హామీలు నమ్మశక్యంగా లేవని రైతు సంఘాల నేతలు అంటున్నారు. ఉపాధి అవకాశాలపై కూడా బిజెపి నిర్ధిష్టమైన ప్రణాళిక వెల్లడించలేదు. శనివారం హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు.
మేనిఫెస్టోలోని కీలక అంశాలు
ధరణి స్థానంలో 'మీ భూమి' యాప్, పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటిన వేతనాలు, పింఛన్లు. మత రిజర్వేషన్లు తొలగించి.. బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు పెంపు. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు. అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు. ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.2,500 ఇన్‌పుట్ సబ్సిడీ. పిఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచిత పంటల బీమా. వరికి రూ.3,100 మద్దతు ధర. ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ. నిజామాబాద్‌ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి.