- మూతపడ్డ 29వేల ప్రభుత్వ పాఠశాలలు
ఖాట్మండు : విద్యా సంస్కరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేపాల్‌లో వేలాదిమంది ఉపాధ్యాయలు బుధవారం నుండి సమ్మెకు దిగారు. రాజధాని ఖాట్మండులో ప్రదర్శనలు నిర్వహించారు. మొత్తం పాఠశాలలు మూతపడ్డాయి. పార్లమెంట్ భవనం నుండి కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలకు దారి తీసే ప్రధాన వీధిని దిగ్బంధిస్తూ టీచర్లు ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ముళ్ళ కంచె వేసి రోడ్డును ఎక్కడికక్కడ బ్లాక్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలను స్థానిక సంస్థల నియంత్రణ కిందకు తీసుకురావాలన్నది బిల్లులో ఒక నిబంధనగా వుంది. దీనిని టీచర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే టీచర్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వుండాలి, వారిని స్థానిక నియంత్రణ కిందకు తీసుకురావద్దని బద్రి దుంగెల్ అనే నిరసనకారుడు పేర్కొన్నారు. ఇతర ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా సమాన వేతనం, హౌదా, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాలు అందాలన్నారు. టీచర్ల ఆందోళనతో మొత్తంగా 29వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.