టాంజానియా : టాంజానియాలోని అతిపెద్ద నగరమైన డార్ ఎస్ సలామ్‌లో జూలై 25-26 రెండురోజులపాటు ఆఫ్రికా హ్యూమన్ క్యాపిటల్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు వివిధ ఆఫ్రికన్ దేశాల నుంచి కనీసం పన్నెండు వందల మంది ప్రతినిధుల హాజరుకానున్నారు. ఈ విషయాన్ని డార్ ఎస్ సలామ్ ప్రాంతీయ కమిషనర్ ఆల్బర్ట్ చలమిలా ఆదివారం వెల్లడించారు. ఈ సమ్మిట్‌కి 30 దేశాలకు పైగా ఆఫ్రికన్ దేశాల నుండి దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారని చలిమిల తెలిపారు. ఇప్పటికే ఈ సమ్మిట్‌కి తరలివస్తున్న ఆఫ్రికన్ దేశాల ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు డార్ ఎస్ సలామ్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతినిధులు టాంజనియా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని చలమిలా అన్నారు.
కాగా, ప్రపంచబ్యాంకు మద్దతుతో.. ఆఫ్రికా దేశాల ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా యువత ఉత్పాదకతను పెంచడం అనే థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహించడుతుందని అధికారిక నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా చలమిలా మాట్లాడుతూ.. 'మిగతా ఆఫ్రికా దేశాల మాదిరిగానే టాంజానియా దేశంలో కూడా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సమ్మిట్‌లో టాంజనియా దేశం తరపున నిరుద్యోగ సవాళ్లను ఎదర్కోవడానికి అవలబించే ఉత్తమ పద్ధతులను ప్రదర్శించడం జరుగుతుంది' అని అన్నారు.










