తిరుపతి : తిరుమల ఆలయంలో వివిఐపీల పక్కన రెగ్యులర్ గా కనపడే లాబీయిస్టు విజయ్ కుమార్ ఎవరి సిఫార్సు కారణంగా తిరుమల ఆలయంలోకి వస్తున్నారు ? ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆయన రంగనాయక మండపంలో కనిపిస్తున్నారు ? తదితర అంశాలపై టీటీడీ యాజమాన్యం వివరణ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సామాన్యులకు అందని ద్రాక్షలా ఉన్న స్వామివారి దర్శనం లాబీయిస్టుల చేతులలో ఎందుకుందని సూటిగా ప్రశ్నించారు. పవర్ బ్రోకర్ లకు, లాబీయిస్టులకు తిరుమల ఆలయంలో ఎందుకు ప్రాధాన్యత లభిస్తుందో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు స్వామివారి భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. తిరుమలకు ఉన్న ప్రతిష్టను మంటగలిపే చర్యలను విడనాడాలని విజ్ఞప్తి చేశారు. సమాజ వ్యతిరేకులను నియంత్రించడం ప్రభుత్వానికి, టీటీడీ యాజమాన్యానికి, పాలకమండలికి విధిగా బాధ్యత ఉండాలని ఆయన కోరారు. ఇటీవల విఐపిలకు టీటీడీలో ప్రాధాన్యత విపరీతంగా పెరిగిందని, సామాన్యుడు సాధారణ దర్శనాలకు గంటల తరబడి, రోజుల తరబడి వేచి ఉంటే, పవర్ బ్రోకర్ లు ఆలయంలో తిష్ట వేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టిటిడి పై పలు రకాల విమర్శలు ఎదురవుతున్నా పాలక పార్టీలు కార్పొరేట్ కంపెనీలకు, లాబీయిస్టులకు టీటీడీని ఆయుధంగా మార్చటం దురదఅష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా ఇలాంటి వారిని నియంత్రించాలని కందారపు మురళి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.










