Nov 15,2023 21:34

ప్రజాశక్తి - పాలకొల్లు (పశ్చిమగోదావరి జిల్లా):అర్హులైన పేదలకు టిడ్కో ఇళ్లు వెంటనే ఉచితంగా అందజేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బుధవారం తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద ఆందోళనకు ఎమ్మెల్యే నిమ్మల పిలుపునిచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఇంటిని బుధవారం తెల్లవారుజామునే పోలీసులు చుట్టుముట్టారు. టిడిపి శ్రేణులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గృహనిర్భందం నుంచి ఎమ్మెల్యే రామానాయుడు తప్పించుకొని పూలపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని పెనుగొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే ఇంటికి బయల్దేరిన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావును పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
వైసిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
టిడ్కో ఇళ్ల వద్ద వంటావార్పు కార్యక్రమానికి టిడిపి పిలుపునివ్వడంతో దానికి పోటీగా టిడ్కో ఇళ్ల వద్దే సభ నిర్వహించేందుకు వైసిపి సన్నద్దమైంది. ఆందోళనకు అనుమతి లేదంటూ వైసిప శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గోపీ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయనను చికిత్స నిమిత్తం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. నరసాపురం డిఎస్‌పి మనోహరాచారి ఆధ్వర్యాన పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.