ఈ నెల 13న ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ
బిజెపితో కలిసే ఎన్నికలకు వెళతాం : నాదెండ్ల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కలిసి పనిచేయాలని టిడిపి, జనసేన రాజకీయ జెఎసి నిర్ణయించింది. టిడిపి-జనసేన సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్‌లో గురువారం జరిగింది. సమావేశ నిర్ణయాలను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు. గవర్నర్‌ను కలవాలన్నా, ఢిల్లీ వెళ్లాలన్నా, ఎన్నికల కమిషన్‌ను కలవాలన్నా ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు కలిసే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరువుపై కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రైతుల పక్షాన నిలబడి పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి పరిహారం అందేవరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో రోడ్లకు మరమ్మతులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నకిలీ మద్యం, విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర సరుకుల ధరలు, ఇసుక అక్రమాలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి మైనార్టీలపై దమనకాండ, ఓటర్ జాబితా అక్రమాలు, పంచాయితీ నిధుల దారిమళ్లింపు, ఉద్యోగుల సమస్యలు తదితర ప్రజా సమస్యలపై కలిసే పోరాటం చేస్తామన్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేక అల్లాడుతున్న యువత సమస్యపై త్వరలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చిన్న సమస్య కూడా లేకుండా రెండు పార్టీలు ముందుకెళతాయని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శని జగన్‌మోహన్ రెడ్డిని వదిలించడమే రెండు పార్టీల మొదటి లక్ష్యమని చెప్పారు. ఈ నెల 13న ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. టిడిపి చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో జనసేన ఇచ్చిన కొన్ని అంశాలను కలిపి ఈ నెల 17 నుంచి ఉమ్మడిగా నిర్వహిస్తామని తెలిపారు. 18,19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై క్షేత్రస్థాయిలో ఆందోళన చేపడతామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే బహిరంగ సభల్లో ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రసంగిస్తారని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలను చైతన్యం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసిపి చిత్తుగా ఓడుతోందని, అందుకే టిడిపి-జనసేన నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. దిశచట్టం లేకుండానే యాప్ పేరుతో బలవంతంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి 15 రోజులకొక్కసారి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొలిట్ బ్యూరోసభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, నాయకులు పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాయకులు కందుల దుర్గేష్, డి మహేందర్ రెడ్డి, కె గోవిందరావు, యశ్వస్వి, బి నాయకర్ పాల్గోన్నారు.
బిజెపి కలవదనుకోవడం ఊహాజనితం : మనోహర్
రాష్ట్రంలో తాము టిడిపితో ఉంటే బిజెపి కలిసిరాదనుకోవడం ఊహాజనితమని, ఎన్నికల్లో ఉమ్మడిగానే కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. టిడిపి, జనసేన జెఎసి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిజెపి తమతో కలిసి రాదని తాము అనుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణాలో కలిసి పోటీచేస్తున్నామని, ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్నామని తెలిపారు.










