Oct 09,2023 07:26

భావ ప్రసారానికి భాష మూలం. మాటలు నేర్చే ప్రతి శిశువూ స్థానిక భాషలోనే మాట్లాడతాడు. మిగిలిన భాషలు ఎంత అందమైనవైనా, ఉన్నతమైనవైనా పరాయి భాష కిందనే లెక్క. మాతృభాషలోనే నేర్చుకోవడం, ఆలోచించడం చేస్తారు పిల్లలు. అందుకే తెలంగాణా ప్రభుత్వం గొండీ, కొలామి, లంబాడీ తదితర భాషలు కలిగిన పిల్లల కోసం ప్రత్యేక పాఠ్య పుస్తకాలు రూపకల్పన చేస్తోంది. పైడిమర్రి రామకృష్ణ తన తెలంగాణ యాసలో 'జోర్దార్‌ కతలు' బాలల కథల పుస్తకం తెచ్చారు. ఇవిగతంలో వ్యవహారికంలో రాసినవే. అయినా, మాండలిక యాసను పిల్లలకు పరిచయం చేయడం కోసమే ప్రత్యేకంగా తిరిగి రాసి చక్కగా 12 కథలతో అచ్చు వేయించారు. కథల్లో అన్నీ పక్షులు, జంతువులే. అయినా మనుషులకు, వారి ప్రవర్తనకు ఇవి దర్పణం. సరళ మాండలికంలో రాయడం చేత చదవడం చాలా తేలిక. ఈ కథల వల్ల ఐకమత్యం, పరోపకారం, సహనశీలత, సాటి వారి పట్ల కరుణ కలిగి ఉండడం, తార్కిక జ్ఞానం తదితర లక్షణాలను చిన్ననాడే పిల్లలకు అలవాడతాయి. పిల్లలకు మాండలిక కథలు కొరుకుడు పడతాయా? అని ఎవరికైనా సందేహం రావచ్చు. పాలపిట్టని, బోడి గుట్టని కంప్యూటర్‌లో తప్ప కళ్లెదురుగా చూడలేని నగర పరివారపు పిల్లలకు చదవడం బహుశా ఇబ్బందేమో! కానీ, నిత్యం ఆకుపచ్చ పొలాల్లో తిరుగాడే బాల బాలికలకు ఈ భాష కరతలామలకం. కథ చదువుతుంటే తమ భాషలో తమను చూసుకున్నట్లవుతుందే కానీ, కష్టం కాబోదు. మొదటి కథ 'ఉల్టా-పల్టా' మొదలు పెడితే చివరి కథ 'మారిన కోతి' వరకు ఏకబిగిన చదివిస్తాయి. మా బడిలో పిల్లల చేత చదివించినప్పుడు, ఒక దాని వెంట ఒకటి వదలకుండా చదివేశారు. ఈ కథలు చదివితే పిల్లల్లో తమ భాష పట్ల, తమ ప్రాంతం పట్ల ప్రేమ పెరుగుతుంది. పక్షులతో, జంతువులతో మానసిక అనుబంధం ఏర్పడుతుంది. పిల్లలని ప్రేమించే పెద్దలు కొని చదివి, తమ పిల్లల చేత చదివించ వలసిన మంచి పుస్తకం 'జోర్దార్‌' కథలు. పుస్తకం కోసం 92475 64699లో సంప్రదించవచ్చు.
- రావూరి రమాదేవి, 99123 5934