ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు) : కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వచ్ఛభారత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఈరన్న, మండల కార్యదర్శి వీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వచ్ఛభారత్ కార్మికులతో పనులు ఎక్కువ చేయించుకుని వారికి తగిన వేతనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కనీస వేతన జీవో అమలు చేయకుండా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వారికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయకుండా 6000, 5000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కుటుంబం గడవాలంటే కనీసం రూ.15,000 రూపాయలు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. 14 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉంచి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆదోని మండలంలో ప్రతి గ్రామంలో ఇద్దరు, ముగ్గురు చొప్పున కార్మికుల పనిచేస్తూన్నారన్నారు. గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలంటే స్వచ్ఛభారత్ కార్మికుల అవసరం కానీ అధికారుల ఆ విధంగా ఆలోచించకుండా వారికి తగినటువంటి పరికరాలు కూడా అందజేయడం లేదన్నారు. కార్మికులకు తగిన పరికరాలు అందజేసి, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులదరితో కలిసి మండల ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.