
పోతే పోయింది యవ్వనం
జీవితం మైదానంలోకి ప్రవేశించింది
ఇప్పుడు హృదయం
అవికార శోభితం
పోతున్నప్పుడే కొంత తెలిసింది
ఇవాళ పూర్తిగా అంతర్ధానమయ్యింది.
ఒకప్పుడు పొగరు దానికి చుట్టం
అతి విశ్వాసం అనుంగు నేస్తం
కాలర్ ఎగరేసే ఉడుకు రక్తం దాని సమస్తం
ఒక యువ కిశోరం
ముగ్గులా మలుపులు తిప్పుతూ
వాహనాన్ని పరిగెత్తించే దృశ్యం
మరొకడు వెడల్పైన కాల్వను
అవలీలగా దాటే సాహసం!
ఇదంతా బాగానే వుంది గాని
వృద్ధులను ముసలి వాళ్లు అని
ఈసడించే విడ్డూరం
చేతి కండలను ప్రదర్శిస్తూ
మురిసిపోయే విచిత్రం!
నిజమే
వయస్సే సగం సొగసు
అయితే వయసూ మనసూ
ఒక నిష్పత్తిలో ఎదగని అక్రమోన్మీలనం.
బలం పెరిగే క్రమంలో
సంస్కారం తగ్గటం ఒక వక్రగతి
అపరిణతి
అవగాహన లేని లోకరీతి.
యవ్వనం పోతే పోయింది గాని
గోరువెచ్చని రక్త చాలనంతో
ఇతరుల పట్ల
కొంచెం ప్రేమ కొంచెం దయ
కించిత్ త్యాగం మేల్కొన్నాయి
మానవత్వం గురించి
ఆలోచించే తీరిక దొరికింది!
పోతే పోయింది యవ్వనం
ఇప్పుడు ఇంటి నిండా
బహుళ సార్థక జీవితం
నిత్య సారాంశ గీతం
నో రిగ్రెట్స్!
- డాక్టర్ ఎన్.గోపి