
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ యూనివర్సిటీల్లో ప్రదర్శనల హౌరు
నిర్బంధాలతో మా నోర్మూయించలేరంటూ నినాదాలు
లండన్/వాషింగ్టన్: దాదాపు రెండు వారాలుగా నాన్‌స్టాప్‌గా గాజాపై వైమానిక దాడులను కొనసాగిస్తూ, ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలను నేలమట్టం చేస్తూ, చిన్నారులు, మహిళలతో సహా వేలాది మంది అమాయకులను పొట్టనపెట్టుకుంటున్న ఇజ్రాయిల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశ దేశాల్లో విద్యార్థులు కేంపస్‌లలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా పలు దేశాల్లో ప్రభుత్వాలు, యూనివర్సిటీ పాలకవర్గాల ఆంక్షలను, నిషేధాలు,నిర్బంధాలను లెక్కచేయకుండా విద్యార్థులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (యుకె), ఎడిన్‌బరో , గ్లాస్గో, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో,కొలంబియా యూనివర్సిటీలు, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ,ఫ్రాన్స్‌లోని టౌలోజ్ యూనివర్సిటీ వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులు పాలస్తీనా సాలిడారిటీ పేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. లండన్‌లో గత శనివారం లక్షన్నర మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తాజాగా ఈ నెల21న జరిగిన మార్చ్‌లో మూడు లక్షల మందికిపైగా విద్యార్థులు, విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు, బ్రిటిష్ సాధారణ పౌరులు పాల్గన్నారు. హార్వర్డు యూనివర్సిటీలో డజనుకుపైగా విద్యార్థి సంఘాలు సంతకాల సేకరణకు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదలజేశాయి.ఆ ప్రకటన మొదటి వాక్యంలో హార్వర్డ్ పాలస్తీనా సాలిడారిటీ కమిటీ సారథ్యంలో దిగువ సంతకాలు చేసిన మేము' ఈ ప్రాంతం (పశ్చిమాసియాలో) అన్ని రకాల హింసకు ఇజ్రాయిల్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని నిందించాల్సి ఉంది' అని పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారం పాలస్తీనా భూములను ఆక్రమించడం, నిర్బంధాన్ని ప్రయోగించడం, సైనిక తనిఖీలు, బలవంతంగా కుటుంబాలను వేరుపరచడం, టార్గెట్‌గా హత్యలు చేయడం, పాలస్తీనీయులు ఎప్పుడు ఏ రూపంలో మృత్యువు కబళిస్తుందోనన్న భయానక వాతావరణం మధ్య జీవించాల్సి రావడం వీటన్నిటికీ ఇజ్రాయిల్‌లోని యూదు దురహంకార ప్రభుత్వాలే కారణమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిని చూసి బ్రిటన్‌లో శక్తివంతమైన అపర కుబేరుడు, హెడ్జ్ ఫండ్ సంస్థ సిఇవో జర్రున ఇంత ఎత్తున లేచాడు. హార్వర్డ్ వర్సిటీ పాలకమండలిలో సభ్యుడైన ఈ సిఇవో పాలస్తీనాకు సాలిడారిటీ తెలిపిన విద్యార్థుల పేర్లను బయటకు విడుదల జేయాలని, ఉద్యోగాలు రాకుండా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లో అసలు పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలే చేయరాదంటూ అక్కడి మాక్రాన్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేశారు. అయినా, వాటిని ధిక్కరించి టౌలోజ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో భారీ మార్చ్ నిర్వహించారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ప్రయోగించింది. నిరసనలపై ఉక్కు పాదం మోపుతోంది. ముస్లింలు, యూదులు గణనీయమైన సంఖ్యలో ఉన్న యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. ప్రభుత్వం ఇటువంటి నిర్బంధాలు, ఆంక్షలతో మా నోర్మూయించలేరు అని ఫ్రాన్స్ విద్యార్థులు ఎలుగెత్తి చాటారు.
మాంచెస్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు పాలస్తీనీయులకు సంఘీ భావంగా నిలిచినందుకు వర్సిటీ అధికారులు ఆమెపై దర్యాప్తునకు ఆదేశించారు.బర్మింగ్ హామ్, గ్లాస్గో వంటి యూనివర్సిటీల్లో విద్యార్థులపై క్రమశిక్షణా చర్యల పేరుతో కొన్ని రోజులపాటు సస్పెండ్ చేశారు. జర్మనీలోని బెర్లిన్‌లో పాలస్తీనా జెండాను పట్టుకున్నందుకు పదిహేనేళ్ల విద్యార్థిని టీచర్ చితకబాదారు. ఆ విద్యార్థిని కొన్ని వారాలపాటు సస్పెండ్ చేశారు. దీనిపై పెద్దయెత్తున విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో ఆ స్కూల్ యాజమాన్యం టీచర్‌ను సిక్ లీవ్‌పై పంపింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జర్మనీలో మితవాద శక్తులు ఎంతగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయో ఈ ఉదంతం తెలియజేస్తోంది.
వివిధ దేశాల్లో విద్యార్థుల నిరసనలపై అక్కడి ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని బ్రిటన్‌కు చెందిన ఇంటర్నేషనల్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫర్ ఈక్వాలిటీ (ఐవైఎస్‌ఎస్‌ఇ) ఖండించింది. ఈ మేరకు అది ఒక పిటిషన్ రూపొందించింది. దీనిపై సంతకాలు చేసినవారిలో పాలస్తీనా అనుకూల అబిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వేధింపులకు గురైన కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రషీద్ ఖలీద్, శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ రజాక్ అబ్దుల్ , మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ నజీర్‌తోబాటు స్కాలర్, జర్నలిస్టు విజరు ప్రసాద్, చరిత్రకారుడు రోక్సో ధన్‌లాల్ ఆర్టిజ్, అమెరికన్ రాజకీయ ఖైదీ జలీల్ ముంతాకిమ్ ఉన్నారు.