కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణాన్ని పట్టించుకోని పాలకులు
ఉప్పునీరు చేరి దెబ్బతింటున్న భూములు
సిఎంనే స్వయంగా ప్రకటించినా అతీగతీలేని దుస్థితి
ఎన్నికల ముందు శంకుస్థాపనల జాబితాలోకేనా ఇది
కొల్లేరు పర్యాటక అభివృద్ధి సైతం కాగితాల్లోనే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : కొల్లేరు ప్రజల గురించి పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఎన్నికల తరుణంలో కొల్లేరు ప్రజలకు హామీలు గుప్పించడం.. గెలిచిన తర్వాత మౌనం వహించడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకొస్తే కొల్లేరును మూడో కాంటూరుకు కుదిస్తామని టిడిపి హామీ ఇచ్చింది. అసెంబ్లీలో తీర్మానం చేసి మమ అన్పించడం తప్ప జరిగిందేమీ లేదు. కొల్లేరులో పర్యాటక అభివృద్ధి సైతం వాగ్దానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికలు, ఆ తర్వాత వైసిపి సైతం కొల్లేరు ప్రజలకు పలు హామీలు గుప్పించింది. కొల్లేరును పర్యాటకంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణానికి సంబంధించి ఒక్క నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు 2022 మే 16న గణపవరంలో జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్ ప్రకటించారు. ఎన్నికలు జరిగి నాలుగేళ్లయింది. కొల్లేరులో పర్యాటక అభివృద్ధి అనేది కాగితాలకే పరిమితమైంది. ఇక రెగ్యులేటర్ల నిర్మాణానికి వస్తే సిఎం ప్రకటించిన ఏడాదిన్నర కావొస్తున్నా ఒక్క అడుగూ ముందుకు పడని దుస్థితి నెలకొంది. దీంతో కొల్లేరు అభయారణ్యం ఉప్పకయ్యలుగా మారుతున్న దుస్థితి ఏర్పడింది. కొల్లేరులోకి సముద్రం నుంచి ఉప్పునీరు చేరి భూములన్నీ దెబ్బతింటున్నాయని, ఉప్పునీరు రాకుండా రెగ్యులేటర్లు నిర్మించాలని ఎప్పటి నుంచో జనం కోరుతున్నారు. దీంతో ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడితడక వద్ద రెగ్యులేటర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.412 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం నిధులకు సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేసినట్లు ప్రకటించారు. అయినా ఇప్పటి వరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అసలు రెగ్యులేటర్ల నిర్మాణం జరుగుతుందా అనే చర్చ కొల్లేరు ప్రజల్లో నెలకొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీల్లో తాగునీటికి సంబంధించి వాటర్ గ్రిడ్ నిర్మాణం, కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం ప్రధానమైనవి. వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. మరో ఏడెనిమిది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ జిల్లాకు ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేరలేదు. వాటర్‌గ్రిడ్ పూర్తికాకపోవడంతో ఇప్పటికీ జనం కలుషిత నీటినే తాగుతూ రోగాలబారిన పడుతున్నారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరగకపోవడంతో కొల్లేరులో ఉప్పునీరు చేరి పర్యావరణం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
పడకేసిన పర్యాటక అభివృద్ధి
కొల్లేరు అభయారణ్యం 77 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రతియేటా వందల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడకు వలస వస్తుంటాయి. కొల్లేరులో బోటు షికారు, రిసార్ట్స్ వంటివి ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. కొల్లేరు ప్రజలతోపాటు ఎంతోమందికి ఉపాధి దొరుకుతోంది. దీనిపై అనేకసార్లు అధికారులు సమీక్షలు చేయడం తప్ప పనులు మాత్రం సాగలేదు. ఆటపాక వద్ద ఉన్న పక్షుల కేంద్రాన్ని సైతం అభివృద్ధి చేయకుండా గాలికొదిలేసిన పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో బడాబాబులు మళ్లీ చేపల చెరువులు తవ్వుతూ కొల్లేరును పూర్తిగా కలుషితం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులేటర్ల నిర్మాణంతోపాటు కొల్లేరు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు.










