- టిటిడి పరిపాలనా భవనం వద్ద అఖిలపక్షం ధర్నా
ప్రజాశక్తి - తిరుపతి టౌన్ : తిరుపతి అభివృద్ధి విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని, సమస్య పరిష్కారం అయ్యే వరకూ వివిధ రూపాల్లో పోరాడుతూనే ఉంటామని అఖిలపక్ష నేతలు ఉద్ఘాటించారు. అఖిలపక్ష పార్టీలను సిఎం వద్దకు తిరుపతి ఎమ్మెల్యే, టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీసుకెళ్లయినా సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో బుధవారం టిటిడి పరిపాలన భవనం వద్ద జరిగిన ధర్నాలో అఖిలపక్షం నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధికి ఒక్కశాతం నిధులను టిటిడి పాలకమండలి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం సమంజసం కాదన్నారు. తిరుపతి అభివృద్ధి వేదిక కన్వీనర్ టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి నేతలు వందవాసి నాగరాజు, కందారపు మురళి (సిపిఎం), పి. మురళి (సిపిఐ), ఆర్. హరికృష్ణ (సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ), పి.అంజయ్య (ఆర్‌పిఐ) నీరుగట్టు నగేష్, వెంకటాచలపతి (ఆమ్‌ఆద్మీ పార్టీ ) డిఎంసి భాస్కర్ (కాంగ్రెస్ పార్టీ ) ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ (బిఆర్‌ఎస్) తదితరులు ప్రసంగించారు. బిజెపి, విహెచ్‌పిల ధర్నా పోస్టర్లకు భయపడి టిటిడి బోర్డు ప్రతిపాదనను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరస్కరించడాన్ని వారు తప్పుబట్టారు. తిరుపతి ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పున్ణపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. టిటిడి లాంటి ధార్మిక సంస్థ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలన్నారు. రూ. 4,500 కోట్ల ఆదాయం ఉన్న టిటిడికి ఒక్కశాతం నిధుల కేటాయింపు పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ లాంటి అభివృద్ధి నిరోధక సంస్థలు తిరుపతి అభివృద్ధికి గత యాభై ఏళ్లుగా అడ్డుపడుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం చేయకుండా, జిఎస్‌టి పేరుతో టిటిడి నుంచి డబ్బులు దండుకుంటూ బాధ్యతారాహిత్యంగా బిజెపి వ్యవహరిస్తోందని తెలిపారు. బిజెపి అవకాశవాదాన్ని, ద్వంద్వవైఖరిని ప్రజలు అర్ధం చేసుకోవాలని, వారి మాయమాటలు, రెచ్చగొట్టే తీరును ఎప్పటికప్పుడు జాగరూకతతో గమనించాలని తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.