Apr 13,2023 16:27

ప్రజాశక్తి-పాడేరు(అల్లూరిజిల్లా) : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలనపై ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రజా పోరుబాట పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు తెలిపారు. పాడేరులోని సిపిఎం కార్యలయంలో జరిగిన సమావేశంలో నాయకులు సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ,బోనంగి చిన్నయ్య పడాల్‌, సిపిఐ అల్లూరి జిల్లా కార్యదర్శి .పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశంలో బిజెపి పరిపాలన కార్పొరేట్‌ మతోన్మాద విధానాలను అమలు చేస్తుందన్నారు. ఆర్థిక విధానాలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, జిఎస్టితో భారాలు మోపుతుందని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ ధరలు పెంచడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా షరతులు విధించి అదనపు బారాలు మోతున్నట్లు తెలిపారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం, .వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇవ్వకపోవడంపై ఈ రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెతపడం లేదన్నారు. ప్రశ్నించే గొంతుక అని ముందుకు వచ్చిన జనసేన పార్టీ కూడా ప్రశ్నించకపోవడం అడగకపోవడం అర్థరహితమన్నారు. వీటితోపాటు గిరిజన ప్రాంతంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలో సహజ సిద్ధంగా పండిన పంటలకు చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. జీవో నెంబర్‌ 3కి చట్టబద్ధత కల్పించాలని 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలన్నారు. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజన గ్రామాల్లో తాగు సాగునీరు కల్పించాలన్నారు. అల్లూరి జిల్లాలో శిశు మరణాలు అరికట్టాలని, గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని, హాస్టల్లో హెల్త్‌ అసిస్టెంట్లను నియమించి విద్యార్థులు యొక్క ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేశారు.కొండ పోడు సాగు చేస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం భూముంటే పట్టా లేకపోతే భూమిని చట్టప్రకారం చూపించి గిరిజనులకు ఇవ్వాలని అన్నారు. పై సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకై సిపిఐ సిపిఎం సాగిస్తున్న మహా పోరుబాట పాదయాత్రను ప్రజలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 14న సీలేరులో ఉదయం 11 గంటలకు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. పది రోజులపాటు జరిగే ఈ పాదయాత్ర 24న పాడేరులో ముగుస్తుందన్నారు. అదే రోజు ప్రజల నుండి వచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టర్‌కి రాతపూర్వకమైన వినతి పత్రాన్ని ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్‌.సుందర్రావు, పాడేరు మండల కార్యదర్శి దీనబంధు, జి మాడుగుల మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, చింతపల్లి మండల కార్యదర్శి జి.సత్యనారాయణ, జికేవిది మండల నాయకులు, సిపిఐ నాయకులు రాధాకృష్ణ పాడేరు మండల కార్యదర్శి కె.సింహాచలం, డి.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.