ప్రజాశక్తి కాకినాడ : ఎన్నికలు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును గురువారం జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక ఇతర శాఖల అధికారులతో కలిసి తనీఖి చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని కలెక్టరు వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో కె శ్రీధర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణి, అగ్నిమాపక శాఖ అధికారి ఎన్. సురేంద్ర ఆనంద్, కాకినాడ పట్టణం తహసీల్దార్ సీతాపతిరావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్.వెంకటేశ్వరరావు (వైసీపీ), ఎస్.అప్పారావు (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.










