Oct 04,2023 07:13

తమరికి విశాఖ ఉక్కు విషయంలో ఏమాత్ర మైనా నిజాయితీ ఉంటే, అది ప్రజల పోరాటం ద్వారా, 32 మంది ప్రాణాల త్యాగం నుంచి పుట్టుకొచ్చినదన్న స్పృహ ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను పూర్తిగా విరమించు కోవాలని డిమాండ్‌ చేస్తూ కనీసం ఒక్క రోజు దేశ రాజధానిలో నిరశన దీక్ష చేయగలరా ? అటువంటిదేదీ చేయడం చేతకాకపోతే కనీసం ఈ బూటకపు ప్రకటనలనైనా చేయడం మానుకోండి.

అయ్యా ! జీవీయెల్‌ గారూ !
గత వారంలో ఎప్పుడో తమరు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి నిలిచి పోయింది అంటూ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మళ్ళీ నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపి వేసింది అని మరోసారి ఉద్ఘాటించారు (?)
మీరేం చెప్తున్నారో మాకైతే అర్ధం కావడం లేదు. మీకైనా అర్ధం అవుతోందా అని మాకు సందేహం కలుగుతోంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగి తీరుతుంది అంటూ పార్లమెంట్‌ లోనే కేంద్ర మంత్రివర్యులు స్పష్టంగా ప్రకటించారు. దానిపై పునరాలోచన కేంద్రానికి లేనే లేదని కూడా మరోసారి స్పష్టం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ ఉందన్నమాటేగా? ఆ సందర్భంలో తమరు కూడా ప్రైవేటీకరణ జరిగినా, కార్మికులకేమీ ఢోకా ఉండదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కినట్టు మాకు గుర్తుంది సుమండీ !
దాదాపు గత 900 రోజులుగా స్టీల్‌ కార్మికులు విశాఖ ఉక్కు ప్రజల సొత్తు అని, తెలుగు ప్రజలు పోరాడి, కేంద్రం మెడలు వంచి సాధించుకున్న పరిశ్రమ అని, దాని జోలికొస్తే సహించేది లేదని పోరాడుతున్నారు. ఆ పోరాటానికి తెలుగు ప్రజలందరి మద్దతూ ఉంది. ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇతరత్రా ప్లాంట్‌ మనుగడను దెబ్బ తీసే కుట్రలను కొనసాగిస్తున్నా, ప్రైవేటీకరణ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసే సాహసం చేయలేక పోతోంది. ఆ విధంగా ఉక్కు కార్మికుల ఐక్య పోరాటం, దానికి పెరుగుతున్న సంఘీభావం ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా ఆపుచేయ గలుగుతున్నాయి.
మడమ తిప్పకుండా పోరాడుతూ కార్మికులు ప్రైవేటీకరణను ఆపు చేస్తే మధ్యలో మీరొచ్చి ''కేంద్ర ప్రభుత్వం నిలుపు చేసింది'' అని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. పోనీ, మీరు చెప్పిందే కరెక్టు అనుకుంటే ప్రైవేటీకరణను నిలుపు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏ తేదీన, ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుందో సదరు నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల కాపీని విడుదల చేయగలరా? ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వుంటే ఆ విషయాన్ని ఉక్కు మంత్రి గారు కాని సంబంధిత శాఖ కార్యదర్శి గాని ఎందుకు ప్రకటించలేదు?
ఇంతకూ నిలుపు చేయడం అంటే అర్ధం ఏమిటి? ''ప్రస్తుతానికి ఆపాము, పరిస్థితి అనుకూలిస్తే వెంటనే అమ్మేస్తాం'' అనా? అడవుల్ని, గనుల్ని, భూముల్ని, దేన్నీ మిగల్చకుండా అన్నింటినీ అదానీలకో, మరో కార్పొరేట్లకో కట్టబెడుతూన్న కేంద్ర ప్రభుత్వం ఒక్క విశాఖ ఉక్కు విషయంలో మాత్రం ఇంకో విధంగా ఆలోచిస్తోంది అనుకోవాలా? ఎన్నికలొస్తున్నాయి గనుక ఇప్పటికి ఆపుచేసి ఎన్నికలైపోగానే అమ్మకం (అర్పించడం) పని మళ్ళీ మొదలెట్టవచ్చు అని అనుకుంటోందా కేంద్రం?
ఉత్తరప్రదేశ్‌ నుండి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ తమరు ఎందుకోగాని తరచూ మా విశాఖపట్నం దయచేస్తూనే వున్నారు. వచ్చినప్పుడల్లా ఏవో కబుర్లు చెప్తూనే వున్నారు. కాని ఆ కబుర్ల తీపి నాలుక చివర్న తగుల్తోందే కాని కనీసం ఆ నాలుక చివరిదాకా కూడా నిలవకుండానే కరిగిపోతోందెందుకో!
తమరు విశాఖ రైల్వేజోన్‌ గురించి కూడా చాలా గొప్పగా చాలాసార్లు ప్రకటించారు. కాని విశాఖ రైల్వేజోన్‌ లో విశాఖ డివిజన్‌ ఉంటుందో, ఊడుతుందో ఆ సంగతి మాత్రం ఇంతవరకూ తేలలేదే! విశాఖ జోన్‌ను అట్టహాసంగా 2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించేశారు కాని మళ్ళీ ఎన్నికలొస్తున్నా దానికి కనీసం ఒక జోనల్‌ మేనేజర్‌ కూడా లేరెందుకని?
వారం, పది రోజులకోసారి తమరు ఏదో ప్రకటించడం, తమరి వందిమాగధులు వెంటనే కల్పించుకుని తమరి ద్వారా మరికొన్ని మంచి పనులు (అనగా ఉత్తుత్తి ప్రకటనలు అని మాకు తెలుసు లెండి) జరగాలని అభ్యర్ధించడం-ఈ డ్రామా చూసి చూసి బోరు కొడుతోంది మాకు.
తమరికి విశాఖ ఉక్కు విషయంలో ఏమాత్ర మైనా నిజాయితీ ఉంటే, అది ప్రజల పోరాటం ద్వారా, 32 మంది ప్రాణాల త్యాగం నుంచి పుట్టుకొచ్చినదన్న స్పృహ ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను పూర్తిగా విరమించు కోవాలని డిమాండ్‌ చేస్తూ కనీసం ఒక్క రోజు దేశ రాజధానిలో నిరశన దీక్ష చేయగలరా?
అటువంటిదేదీ చేయడం చేతకాకపోతే కనీసం ఈ బూటకపు ప్రకటనలనైనా చేయడం మానుకోండి. మీతో పువ్వులు పెట్టించుకోడానికి మా చెవులేమీ తేరగా లేవు సుమా!
ఇట్లు,
విశాఖ ఉక్కు కార్మికులు.

- సుబ్రమణ్యం