పాలస్తీనా సాయుధ పోరాట గ్రూప్ హమాస్, యూదు జాత్యహంకార ఇజ్రాయిల్ దళాల మధ్య దాడులు, ప్రతి దాడుల్లో అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులతో సహా వందలాది మంది అమాయక పౌరులు చనిపోవడం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది. 'ఆపరేషన్ అల్ అక్సా'కు ప్రతిగా 'ఆపరేషన్ స్వోర్డ్స్' పేరుతో ఇజ్రాయిల్ చేపట్టిన భీకర వైమానిక దాడుల్లో 91 మంది పిల్లలతో సహా 560 మంది పాలస్తీనీయులు గత నాలుగు రోజుల్లో చనిపోయారు. మరో 2,900 మంది దాకా గాయపడ్డారు. పాలస్తీనా ప్రతిఘటనా గ్రూపులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 800 మంది దాకా ఇజ్రాయిలీయులు మరణించారని, మరో 2,243 మంది గాయపడ్డారని పాశ్చాత్య మీడియా తెలిపింది. ఇంత భారీ యెత్తున ఘర్షణలు, హింస చోటు చేసుకోవడం గత ఇరవై ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ భయంకర మారణ హౌమానికి పూర్తి బాధ్యత ఇజ్రాయిల్‌దేననడంలో మరో మాటకు తావులేదు. ఇజ్రాయిల్ చరిత్రలోనే అత్యంత ఫాసిస్టు తరహా పాలకుడిగా పేరుమోసిన నెతన్యాహు హమాస్ భారీ ఆపరేషన్‌ను సాకుగా తీసుకుని పాలస్తీనీయులపై పెద్దయెత్తున వైమానిక దాడులు కొససాగించడంతోబాటు గాజాను పూర్తిగా దిగ్బంధించే చర్యలకు పాల్పడుతున్నాడు. పాలస్తీనా ప్రజలకు నీరు, ఆహారం, కరెంటు, ఇంధన సరఫరాలను అందకుండా చేస్తున్నాడు. 75 ఏళ్లుగా పాలస్తీనీయుల భూ భాగాలను ఆక్రమించుకుని, పాలస్తీనీయులను తమ సొంత గడ్డపై శరణార్థులుగా మార్చిన ఇజ్రాయిల్ అకృత్యాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. అమెరికా అండ చూసుకునే అది మోర విడుచుకుని ఇంతగా బరితెగిస్తున్నది. ఇజ్రాయిల్ మిలిటరీ బడ్జెట్‌కు అమెరికా ప్రతి యేటా భారీగా సాయం అందిస్తున్నది. ఈ ఒక్క ఏడాదే 330 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చింది. గాజాపై దండెత్తుతున్న ఇజ్రాయిల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం తన భారీ యుద్ధ విమాన నౌకలను, క్షిపణులను మధ్య దరా సముద్ర తీరంవైపు పంపుతున్నది. ఇజ్రాయిల్‌పై హమాస్ జరుపతున్న దాడిని ఖండించాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తున్నది. భారత్‌లో మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఆ ఒత్తిడికి తలొగ్గింది. మితవాదం, జాత్యహంకారం వంటి విషయాల్లో నెతన్యాహుకు మోడీ ఏమాత్రం తీసిపోరనడానికి గత తొమ్మిదేళ్లలో దేశంలో చోటు చేసుకున్న ఘటనలే నిదర్శనం.
అసలు ఇజ్రాయిల్ పుట్టుకే విచిత్రమైనది. 1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా భూభాగాన్ని మూడు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించింది. దీనికి 33 దేశాలు మద్దతు పలకగా, స్వతంత్ర భారతదేశం సహా 13 దేశాలు అభ్యంతరం తెలిపాయి. చైనా సహా 10 దేశాలు గైర్హాజరయ్యాయి. 1948లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం లేకుండానే బ్రిటన్ అండతో ఇజ్రాయిల్ ఏకపక్షంగా దేశాన్ని ప్రకటించుకుంది. 'ఇంగ్లండ్ ఆంగ్లేయులకు, ఫ్రాన్స్ ఫ్రెంచి వారికి చెందినట్లే పాలస్తీనా అరబ్బులకు చెందినది' అని మహాత్మా గాంధీ 'హరిజన్' వారపత్రికలో 1931లోనే రాశారు. చమురు వనరులకు కొదవ లేని పశ్చిమాసియాలో వనరులను కొల్లగొట్టుకుపోయేందుకు సామ్రాజ్యవాద దేశాలు పన్నిన కుటిల పన్నాగంలో భాగంగానే ఇజ్రాయిల్ ఆవిర్భావం జరిగింది. తూర్జు జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాలు, రూపొందించిన ప్రణాళికలు ఇంతవరకు వాస్తవరూపం దాల్చలేదు. ఐరాస ఆధీనంలో ఉండాలని నిర్ణయించిన జెరూసలెమ్‌ను మూడేళ్లలోనే ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. 1993 నాటి ఓస్లో ఒప్పందాలు పాలస్తీనా రాజ్యం ఏర్పడుతుందనే భావన కలిగించినా, ఆచరణ అందుకు భిన్నంగా సాగింది. ఇజ్రాయిల్ సెక్యులర్ శక్తులను నాశనం చేసి, పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకుంటూ వెళ్లింది. నాటి పాలస్తీనా భూభాగంలో 13 శాతం మాత్రమే నేడు పాలస్తీనా నియంత్రణలో ఉంది. ఇప్పుడు గాజాపై నెతన్యాహు దండెత్తి ఆ భూ భాగాన్ని కూడా కబళించాలని చూస్తున్నాడు. పశ్చిమాసియాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఇజ్రాయిల్ కేంద్రంగా అమెరికా తన రాజకీయ భౌగోళిక వ్యూహాన్ని దూకుడుగా అమలుచేస్తున్నది. అమెరికా అండతోనే పాలస్తీనాకు చెందిన వెస్ట్‌బ్యాంకు, తూర్పు జెరూసలెమ్‌లలో పాలస్తీనీయులను గెంటివేసి 63 లక్షలకు పైగా ఇజ్రాయిలీ సెట్లర్లు అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఈ సెట్లర్ గ్యాంగ్‌లు, ఇజ్రాయిల్ ఆర్మీ కలసి హువారా ప్రాంతంలో పాలస్తీనీయుల ఇళ్లను, కార్లకు తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. వీటన్నిటి పర్యవసానమే హమాస్ గత శనివారం జరిపిన ఆపరేషన్. ఇజ్రాయిల్‌ను సమర్థించేవారు దీనికి ఏం సమాధానం చెప్తారు? గాజా ప్రజలపై వార్ డిక్లేర్ చేఐసిన నెతన్యాహు ప్రభుత్వం తెల్ల భాస్వరాన్ని ఆయుధంగా ఉపయోగించడం అత్యంత హేయమైన చర్య. ఇటువంటి పదార్థాలను యుద్ధంలో ఉపయోగించకుండా అంతర్జాతీయు చట్టం నిషేధం విధించింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పౌర మరణాలను అరికట్టాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది. దీనికి ఒకే ఒక పరిష్కారం పాలస్తీనీయుల న్యాయసమ్మతమైన డిమాండ్లను అంగీకరించడం. అదే సమయంలో అమాయక పౌరులకు హాని కలిగించే చర్యలను నిర్ద్వంద్వంగా ఖండించాలి. భద్రత ఇజ్రాయిలీలకు మాత్రమే కాదు, పాలస్తీనీయులకు కూడా ఉండాలి. మానవ హక్కులు, పూర్తి స్థాయి పౌరసత్వం, తమ స్వస్థలాలకు తిరిగి వచ్చే పాలస్తీనీయుల హక్కును అమలు చేసేందుకు ఐరాస కృషి చేయాలి. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా పాలస్తీనాకు సంఘీభావంగా నిలవాలి.