Oct 15,2023 13:17

టెహ్రాన్‌ : '' గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను తక్షణమే నిలిపివేయాలి.. గాజా భూభాగంలో ఇజ్రాయెల్‌ భూతల దాడులు చేస్తే ప్రతిస్పందించవలసి ఉంటుంది '' అని ఇజ్రాయిల్‌ కు ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. గాజా భూభాగంలో ఇరాన్‌ మద్దతు ఉన్న హమాస్‌పై భూదాడి చేయడానికి ఇజ్రాయెల్‌ శనివారం సన్నద్ధమయ్యింది. ఇజ్రాయెల్‌ పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి ఇజ్రాయిల్‌ దళాలను సమన్వయం చేసింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్‌ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్‌ రక్షణ దళాల (ఐడీఎఫ్‌) ప్రతినిధి డానిల్‌ హాగరీ అన్నారు. ఈ నేపథ్యంలో ... ఇజ్రాయిల్‌ను ఇరాన్‌ హెచ్చరించింది. ఇజ్రాయిల్‌ చేపట్టిన మారణహోమం అదుపు తప్పుతోందని, తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్‌-నియంత్రిత గాజా భూభాగంలో ఇజ్రాయెల్‌ భూతల దాడులు చేస్తే ప్రతిస్పందించవలసి ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఇరాన్‌ మిషన్‌ సోషల్‌ మీడియా పోస్టు ద్వారా హెచ్చరికలు జారీ చేసింది.

                                                                           ఇరాన్‌ హెచ్చరికలు..

'' గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను తక్షణమే నిలిపివేయాలి. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ రకమైన యుద్ధం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీని అంతాన్ని ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్‌ బాధ్యత తీసుకునే స్థాయికి వెళుతోంది. '' అని ఇరాన్‌ స్పష్టం చేసింది.