- విశాఖ నుంచి విజయవాడకు బైకు ర్యాలీ
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ నినాదంతో ఉక్కు కార్మికులు విజయవాడకు కదిలారు. సిపిఎం ఆధ్వర్యాన బుధవారం జరిగే ప్రజారక్షణ భేరి సభలో పాల్గనేందుకు విశాఖలోని కూర్మన్నపాలెం కూడలిలోని ఉక్కు దీక్షా శిబిరం నుంచి వీరు బైకు ర్యాలీగా బయలుదేరారు. సిపిఎం, సిఐటియు కమిటీల ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేపట్టిన బైకు ర్యాలీని ఉక్కు నిర్వాసిత మహిళ బడ్డ వెంకటమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు కుట్రలకు స్టీల్‌ప్లాంట్ బలైపోతుంటే రాష్ట్రంలోని జగన్ సర్కారు చేష్టలుడిగి చూస్తుండటం దారుణమన్నారు. ప్లాంట్ పరిరక్షణకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. పోరాటాలతోనే కర్మాగారాన్ని కాపాడుకోగలమని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్‌నార్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలగ్గి కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తమిళనాడు, కేరళలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకునేందుకు ఆయా ముఖ్యమంత్రులు చేస్తోన్న కృషిని వివరించారు. అనకాపల్లి మీదుగా విజయవాడ వైపు బైక్ ర్యాలీ సాగింది.