
- తెరపైకి కొలాబ్ ఫైల్స్ సాఫ్ట్‌వేర్
- రాష్ట్ర సమాచారం ఇకపై ఇందులో అప్‌లోడ్
- తాజాగా విజయవాడలో నోడల్ అధికారులకు శిక్షణ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొల్లాబ్ ఫైల్స్ అనే సాంకేతిక ఆధారిత డొమైన్‌ను తెరమీదకు తీసుకొచ్చింది. దీంతో భవిష్యత్తులో రాష్ట్రాలకు సంబంధించిన కీలక సమాచారం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనుంది. కొల్లాబ్ ఫైల్స్ సాప్ట్‌వేర్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలోని ఎన్‌ఐసి మానిటరింగ్ చేయనుంది. ఫలితంగా రాబోయో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఫ్రభుత్వ కనుసన్నల్లో నడవక తప్పని పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేక పోలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నేషనల్ ఇన్ఫోర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసి) కొలాబ్ ఫైల్స్ అనే నూతన పోర్టల్ ను మనుగడ లోకి తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నూతన సాప్ట్‌వేర్‌ను దేశీయంగా తీసుకొచ్చినప్పటికీ ఇకపై రాష్ట్రాలు, స్దానిక సంస్ధలకు చెందిన పరిపాలనాపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, అభివృద్ది కార్యక్రమాలు, ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలతో పాటు ప్రభుత్వానికి చెందిన పలు రహస్య విషయాలను నూతన సాప్ట్‌వేర్‌ద్వారా భద్రపరచాలని కేంద్రం పేర్కొంటోంది.ఇందులో ప్రభుత్వ అధికారులు వారికి కావాల్సిన ఫైల్స్ ( వర్డ్, పవర్ పాయింట్ , ఎక్సెల్, పిడిఎఫ్, మరియు ఇతర డాక్యుమెంట్లు, వారి లాగిన్ నుండి ఇతరులకు సులభంగా పంపే విధానాన్ని ఇందులో తీసుకొచ్చారు. తాజాగా సాప్ట్ వేర్ ఉపయోగంపై నోడల్ అధికారులకు ఎన్‌ఐసి శిక్షణ ఇచ్చింది. గత వారంలో విజయవాడలోని ఓ త్రీస్టార్ హోటల్‌లో నూతన సాప్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ గుగూల్‌తో పాటు విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల సాప్ట్‌వేర్ ద్వారా డేటా ను భద్రపరిచే వారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించి ఏమైనా వివరాలు కావాలని కేంద్రం కోరినా కొన్ని రాష్ట్రాలు ఆయా వివరాలు ఇవ్వడం లేదనే వాదన కూడా వినబడుతోంది. కాగ్ లాంటి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలు పేర్కొన్న అభ్యంతరాలను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరిచేసుకోవడం లేదు. తాజాగా కేంద్ర ఫ్రభుత్వం తీసుకొచ్చిన కొల్లాగ్ ఫైల్స్ అనే సాప్ట్‌వేర్ ద్వారా అధికారిక ఫైల్స్‌ను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫైల్స్ ద్వారా సేకరించిన డేటాను రహస్యంగా ఉంచడం, నాలెడ్జ్ షేరింగ్, సురక్షితంగా రికార్డులను ఉంచడంతో పాటు యాక్సెస్ సులభతరం చేయడం సులభంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.ప్రభుత్వం వీటి యొక్క వినియోగం వారి అధికారిక మెయిల్ ఐడి ద్వారా మాత్రమే జరపాల్సి ఉంటుంది. ఫలితంగా సాంకేతికంగా ఎటువంటి సమస్య ఉండక పోవడంతో పాటు ఫైల్స్ అన్ని కూడా ఇ-ఆఫీస్ కు అనుసంధానం చేయడంతో పరిపాలన మరింత వేగవంతం అవుతుందని ఎన్‌ఐసి అధికారులు పేర్కొంటున్నారు.ఈ పోర్టల్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారి నుండి ఏ సమాచారం కావాలన్నా జిల్లా స్థాయి అధికారులు వెంటనే పొందుపరచి వారి లాగిన్ నుంచి పంపే వీలుంటుంది. ఫలితంగా ఎటువంటి ప్రైవేట్ మెయిల్స్ వాడాల్సిన అవసరం రాదని, రానున్న రోజుల్లో వీటి వినియోగం పెరుగుతుంది అని ఎన్‌ఐసి అధికారులు పేర్కొంటున్నారు.