
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సహకార సంస్థ (జిసిసి) ద్వారా గిరిజనులు పండిస్తున్న కాఫీ గింజల కొనుగోలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు జిసిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పాడేరు సొసైటీ పరిధిలోని దిగుమోదాపుట్టు గ్రామంలో రైతుల నుంచి కాఫీ గింజలను సేకరించి, తూకం వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. జిసిసి ఉత్పత్తి చేస్తున్న అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, ఆదరణను తీసుకురావడంలో సహకరిస్తున్న గిరిజన రైతులను, జిసిసి సిబ్బందిని అభినందించారు. ఈ సీజన్‌లో పాడేరు, చింతపల్లి, రంపచోడవరం డివిజన్లలోని తొమ్మిది సొసైటీల పరిధిలో 1500 మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను కొనుగోలు చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. అరబికా పార్చ్‌మెంట్ కాఫీ గింజలకు కిలోకు రూ.280, అరబికా చెర్రీ కాఫీ గింజలకు కిలోకు రూ.145, రోబస్టా చెర్రీ కాఫీ గింజలకు కిలోకు రూ.70 మార్కెట్ ధర నిర్ణయించామన్నారు. దళారుల దోపిడీని నిరోధిస్తామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పించేందుకు జిసిసి సహకరిస్తోందని, ఇప్పటి వరకూ 3900 మంది రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేయించామని తెలిపారు. కాఫీ గింజల నుంచి పౌడర్‌ను తయారు చేసేందుకు కొయ్యూరు మండలం డౌనూరులో రూ.4 కోట్ల వ్యయంతో ఇంటిగ్రిటేడ్ కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.