Jul 07,2023 14:51

మాడ్రిడ్‌ : స్పెయిన్‌లో జూలై 23న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచార జోరు గురువారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో స్పానిష్‌ సోషలిస్ట్‌ వర్కర్స్‌ పార్టీ తరపున ప్రస్తుత ప్రధాని పెడ్రో సాంచెజ్‌ మరోసారి ప్రధాని అభ్యర్థిగా నిలబడ్డారు. ప్రతిపక్ష పార్టీ అయిన పీపుల్స్‌ పార్టీ నుంచి అల్బెరో నునెజ్‌ ఫీజూ మాత్రమే కాక ఇతర పార్టీల నుంచి మరికొందరు ప్రధాని పదవికి పోటీ చేశారు. ఈ సందర్భంగా ఈ పార్టీ నేతలు గెలుపు లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని గురువారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో పెడ్రో సాంచెజ్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... 'స్పానిష్‌ ప్రజలు సోషలిస్ట్‌ వర్కర్స్‌ పార్టీకి భారీ మెజార్టీని అందిస్తారని నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఈ పార్టీనే గెలిచి అధికారం చేపట్టబోతోంది' అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పానిష్‌ ప్రజలపై పెనుభారంగా ఉన్న తనఖా భారం నుండి ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపడతానని హామీనిచ్చారు. మరోవైపు పీపుల్స్‌ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలిచిన ఫిజూ తన ప్రచారంలో నీటికొరత సమస్యను ఎత్తిచూపారు. ఈ ఎన్నికల్లో గెలిచి తాను ప్రధాని పదవి చేపడితే.. దేశంలో నీటి కొరతను పరిష్కరిస్తానని ప్రజలకు హామీనిచ్చారు.
కాగా, స్పెయిన్‌లో ఇటీవల జరిగిన స్థానిక, నగర ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. దీంతో ప్రధాని శాంచెజ్‌ ఈ ఏడాది మే 29వ తేదీన ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జూలై 23 స్పెయిన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.