
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలోని జనాభాను పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కొన్ని స్థానాలను కోల్పోతా యి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఉత్తర భారత రాష్ట్రాలకు మరో 32 స్థానాలు కలుస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాలు 24 స్థానాలను కోల్పోతాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా రు. దీనికితోడు పార్లమెంటులోనూ, రాష్ట్రాల శాసనసభలలో నూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రధానంగా రెండు మార్పులు చోటుచేసుకుంటాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గి ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ప్రాభవం పెరుగుతుంది. దేశ రాజకీయాలలో పురుషుల ఆధిపత్యం తగ్గి మహిళలకు సముచిత ప్రాధాన్యత లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే జనాభా స్థిరంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గడంతో పాటు ఆయా రాష్ట్రాల నుండి మహిళల ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతుంది.