జూబ : సూడాన్ నుంచి 2011లో దక్షిణ సూడాన్ స్వాతంత్య్రం సాధించుకుంది. ఉత్తర ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్ స్వాతంత్య్రానంతరం వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుపుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సాల్వా కీర్ మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికలు వాయిదా పడి వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో జరగనున్నట్లు ఆయన తన పార్టీ (పీపుల్స్ లిబరేషన్ మూమెంట్) సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు ముందు దేశంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
కాగా, దక్షిణ సూడాన్ స్వాతంత్య్రం పొందిన తర్వాత కీర్‌నే దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు.. ఉపాధ్యక్షుడు రిక్ మచార్ మధ్య రాజకీయ వైరుధ్యాలు తలెత్తి ఇరు వర్గీయుల మధ్య అంతర్యుద్ధం జరిగింది. 2013లో మొదలైన ఈ అంతర్యుద్ధం ఐదేళ్లపాటు కొనసాగింది. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 40 వేల మంది పౌరులు మృతి చెందారు. ప్రాణ నష్టమే కాకుండా.. వరదలు, కరువు, రాజకీయ కలహాలతో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని దేశం అట్టుడుకుంది. దీంతో దేశంలో శాంతిని నెలకొల్పడానికి సాల్వాకీర్, ఉపాధ్యక్షుడైన రిక్ మచార్‌లు 2018లో ఓ శాంతి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ శాంతి ఒప్పందం అమలు సాధ్యం కాలేదు. దీంతో 2023లో జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పంద అమలు జాప్యాన్ని నివారించేందుకు 2024లో ఎన్నికలు జరగాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి నికోలస్ హేసోవ్ ఈ ఏడాది మార్చిలో పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు దక్షిణ సూడాన్ ఎన్నికల షెడ్యూల్‌ను కీర్ మంగళవారం ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా మరోమారు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన శాంతి ఒప్పందాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.










